CM Revanth Assembly Speech Today :గొప్ప ఆశయాలు, ఆకాంక్షలతో తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. స్వరాష్ట్రంలో తమకు రక్షణ ఉంటుందని, కలలు నెరవేరతాయని ప్రజలు భావించారని, కానీ ప్రజాకాంక్షలు గత తొమ్మిదిన్నరేళ్లలో నెరవేరలేదని పేర్కొన్నారు. నిరంకుశ ప్రభుత్వం వద్దని ప్రజలు కాంగ్రెస్‌కు అవకాశం ఇచ్చారని చెప్పారు. గవర్నర్ ప్రసంగానికి కూడా ప్రతిపక్ష నేత రాకపోవటం విచారకరమని, విపక్ష నేతలు ఇప్పటికైనా సరైన ప్రతిపక్ష పాత్ర పోషిస్తారని ఆశిస్తున్నామని వ్యాఖ్యానించారు. ప్రధాన ప్రతిపక్ష నేత సభకు రాకుండా ఉండటం సభను అగౌరపరచటమేనని మండిపడ్డారు.
"డిసెంబర్ 9వ తేదీన కొన్ని కీలక హామీలను మంత్రివర్గంలో ఆమోదించాం. తెలంగాణ ఉద్యమ సమయంలో అందరం టీజీ అని రాసుకునేవాళ్లం. కొందరు యువకులు తమ గుండెలపై టీజీ అని పచ్చబొట్టు వేయించుకున్నారు. ఉద్యమ సమయంలో వాహనాలపై, బోర్డులపైన అందరం టీజీ అని రాసుకున్నాం. కేంద్రం కూడా తమ నోటిఫికేషన్‌లో టీజీ అని పేర్కొంది. అందరి ఆకాంక్షలకు విరుద్ధంగా గత ప్రభుత్వం తమ పార్టీ పేరు స్ఫురించేలా టీఎస్ అని పెట్టింది. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మేం రాష్ట్ర అక్షరాలను టీజీగా మార్చాలని నిర్ణయించాం. రాష్ట్ర అధికారిక చిహ్నంలో రాచరిక ఆనవాళ్లు ఉన్నాయి. ప్రజాస్వామ్య పాలనలో రాజరికం ఉండకూడదని భావిస్తున్నాం." - రేవంత్ రెడ్డి, రాష్ట్ర ముఖ్యమంత్రి