CM Jagan Forget Their Promises :ముఖ్యమంత్రి ఏదైనా ప్రాంతానికి వచ్చి హామీల జల్లు కురిపిస్తే ఆ పనులన్నీ త్వరితగతిన పూర్తవుతాయని అక్కడ ప్రజలు భావిస్తారు. కానీ అంతా అనుకున్నట్లు జరిగితే ఆ సీఎం జగన్ ఎందుకవుతారు? రివర్స్ పాలన సాగించే మన ముఖ్యమంత్రి రూటే సపరేటు కదా! రెండేళ్ల క్రితం గుంటూరు జిల్లా ప్రత్తిపాడు సభలోనూ గుంటూరు ఛానల్ పొడిగింపు సహా వేళ్లపై లెక్కపెట్టలేనన్ని హామీలు గుప్పించారు. తీరా చూస్తే ఒక్కటి అమలుకు నోచుకోలేదు. దీంతో సీఎం ఇచ్చే హామీలకే దిక్కులేకపోతే సమస్యలు ఎలా తీరతాయని జనం చర్చించుకుంటున్నారు.
గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గ అభివృద్ధి కోసం సీఎంజగన్ మోహన్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన హామీలు అన్నీ ఇన్నీకావు. రెండు సంవత్సరాలు దాటినా ఒక్క హామీకి సంబంధించిన పనులు ప్రారంభం కాలేదు. గుంటూరు ఛానల్ పొడిగింపుపైన అయితే ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు రెండు సార్లు, సీఎం హోదాలో ఒకసారి హామీ ఇచ్చారు. ఛానల్ పొడిగింపు పనులకు గత ప్రభుత్వంలోనే పరిపాలనా అనుమతులు వచ్చి నిధులు కేటాయించారు.
వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రివర్స్ టెండరింగ్ పేరుతో పనుల్ని నిలిపివేసింది. భూసేకరణ ప్రక్రియ తామే చేపట్టినట్లు ప్రచారం చేసుకోవటం కోసం గత ప్రభుత్వ కేటాయింపుల్ని రద్దు చేశారు. ఆ తర్వాత గుంటూరు జిల్లా పరిధిలో 381 ఎకరాలు, బాపట్ల జిల్లా పరిధిలో 51 ఎకరాలు భూసేకరణకు సంబంధించి ప్రాథమిక ప్రకటన విడుదల చేశారు. రైతులకు పరిహారం ఇవ్వడానికి నిధులు మంజూరు చేయకపోవడంతో భూసేకరణకు ముందడుగు పడలేదు. సాక్షాత్తు సీఎం జగన్ ఇచ్చిన హామీకే దిక్కులేకపోతే ఎలాగంటూ స్థానిక ప్రజలు ప్రశ్నిస్తున్నారు.