Home Triangle App Services in AP : రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వేల మంది ఎలక్ట్రీషియన్లు, ప్లంబర్లు, కార్పెంటర్లు, బ్యూటీషియన్లు వంటి వృత్తులు చేసిన వారిని ఆదుకోవాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో మెప్మా అధికారులు చర్యలు చేపట్టారు. వారికి ఆన్లైన్ ఆర్డర్లు ఇవ్వడం ద్వారా ఆదాయం పెంచేలా నూతన విధానాన్ని ప్రారంభించాలని నిర్ణయించారు. దీనికోసం ఇటీవలే హోం ట్రయాంగిల్ యాప్ నిర్వాహకులతో మెప్మా ఎంవోయూ చేసుకుంది.
ఎలక్ట్రికల్, ప్లంబింగ్, బ్యూటీషియన్లకు సంబంధించి సేవలను తక్కువ ధరలోనే వినియోగదారుల ఇండ్ల వద్దకు వెళ్లి అందించేలా ఏర్పాట్లు చేస్తోంది. టీవీ, సోలార్, మేకప్, ఫేషియల్, గ్యాస్ స్టవ్, గృహోపకరణాలు రిపేర్ సేవలు అందించనున్నారు. ఇల్లు మారినపుడు సామాన్లు మరో చోటికి తరలించేలా మూవర్స్, ప్యాకర్స్ వంటి సేవలనూ అందుబాటులో ఉంచుతున్నారు. ఇప్పటికే పలు కోర్సులు చదివిన వారు, అనుభవం ఉన్నవారి పేర్లను నమోదు చేసుకుంటున్నారు. వారు చదివిన కోర్సులకు సంబంధించి ధ్రువపత్రాలు, గుర్తింపు కార్డులు, బ్యాంక్ అకౌంట్ పుస్తకాలను తీసుకుని వివరాలు పొందుపరుస్తున్నారు. అందరికి ప్రత్యేకంగా శిక్షణా తరగతులు ఏర్పాటు చేసి తర్ఫీదు ఇచ్చి ధ్రువపత్రాలు జారీ చేస్తారు.
Home Triangle to Boost SHG Products : ఇంటి వద్దకు వెళ్లి సేవలందించేందుకు వీలుగా ప్రత్యేకంగా యూనిఫాం, ఐడీ కార్డు ఇవ్వనున్నారు. ఈ విధంగా నకిలీలు, మోసాలకు తావులేకుండా చర్యలు తీసుకుంటున్నారు. రిజిస్టర్ చేసుకున్న వారికి శిక్షణతో పాటు తొలి మూడు నెలల పాటు ఉచితంగా ఆర్డర్లు ఇవ్వనున్నారు. ఆపై నామమాత్రపు రుసుముతో నెలకు 25 ఆర్డర్లను ఇవ్వాలని నిర్ణయించారు. ఈ యాప్ ద్వారా జరిగే సేవలు, నగదు చెల్లింపు, సేవాలోపం లేకుండా చర్యలు తీసుకుంటారు.
"ప్రభుత్వమే మమల్ని ఆదుకోవాలనే ఉద్దేశంతో ఆన్లైన్ సేవలను ప్రవేశపెట్టడం మాకు సంతోషంగా ఉంది. ఆధునిక కాలంలో ఆన్లైన్ సేవలకు డిమాండ్ పెరిగింది. దీంతో మాలాంటి వారికి సరిగ్గా ఉపాధి లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. ఉపాధి కరువైన ప్రస్తుత పరిస్ధితుల్లో మాకు ప్రభుత్వం ఆన్లైన్ ద్వారా ఆర్డర్లు ఇచ్చే విధానం తీసుకురావడం ఎంతో మేలు చేస్తుంది. హోం ట్రయాంగిల్ యాప్ మాకు ఎంతో ఉపయోగపడుతుంది. వీటితో మేము బయట ఆర్డర్లు చేసుకోవచ్చు." - వృత్తిదారులు
ఫిర్యాదులన్నింటిని మెప్మా అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తారు. పలు ప్రైవేట్ సంస్థలు అందిస్తోన్న సేవల కన్నా తక్కువ ధరలోనే నాణ్యమైన సేవలను అందిస్తామని ఎలాంటి ఇబ్బందులు ఉండవని అధికారులు చెబుతున్నారు. అతి త్వరలోనే యాప్ సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం శరవేగంగా ప్రయత్నాలు చేస్తోంది. తద్వారా పేద,మధ్య తరగతికి చెందిన చేతి, కులవృత్తిదారులకు ఉపాధి, ఆదాయం పెరగనుంది.
రాజధాని నిర్మాణంలో యువతను భాగస్వామ్యం చేయడంపై ప్రభుత్వం ఫోకస్