ఎన్నికల ప్రచారంలో పచ్చి అబద్ధాలు- ఓట్ల కోసం ఇంతగా దిగజారాలా జగన్? CM Jagan Election Campaign:శవరాజకీయాలకు అలవాటుపడ్డ జగన్ మరోసారి అలాంటి ప్రచారానికే ఒడిగట్టారు. దీనికి ఈసారి పింఛన్ల పంపిణీని ఆయుధంగా వాడుతున్నారు. తనకు మద్దతుగా నిలిచిన అధికారులతో కలిసి పింఛనుదారులను ఇబ్బంది పెట్టి ఆ నెపాన్ని ప్రతిక్షాలపై నెట్టాలనే కుట్రకు తెరదీశారు.
ఇందులో భాగంగానే చిత్తూరు జిల్లా పూతలపట్టులో నిర్వహించిన మేమంతా సిద్ధం సభలో ప్రతిపక్షాలు ముఖ్యంగా తెలుగుదేశం పార్టీపై తీవ్ర ఆరోపణలు చేశారు. పింఛనుదారుల పాట్లకు ప్రభుత్వం, అధికారుల నిర్లక్ష్యం కారణం కాగా అదంతా తెలుగుదేశం అధినేత చంద్రబాబు కుట్రని ఆరోపించారు. ఏకంగా వాలంటీర్ల వ్యవస్థనే రద్దు చేశారంటూ దిగజారి అవాస్తవాన్ని ప్రచారం చేశారు.
వాలంటీరు వ్యవస్థను రద్దు చేశారని సీఎం జగన్ ఎంత పచ్చి అబద్ధాలు చెబుతున్న సీఎం అలాంటి ఉత్తర్వులుంటే చూపించగలరా? ముఖ్యమంత్రి స్థాయిలోని వ్యక్తి ఓట్ల కోసం ఇంతగా దిగజారాలా? వాలంటీర్లను నగదు పంపిణీకి దూరంగా ఉంచాలని మాత్రమే కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది.
ప్రతిపక్షాలపై బురద జల్లేందుకు పింఛన్ల నిలిపివేత - అధికారులు ఇంటి వద్ద ఇవ్వలేరా?: చంద్రబాబు - CHANDRABABU PRAJAGALAM
దాన్ని వక్రీకరిస్తూ ఏకంగా వాలంటీరు వ్యవస్థనే రద్దు చేశారని రాజ్యాంగబద్ధ సంస్థపైనే నెపం వేయడం ఏంటి? వాలంటీర్ల ద్వారా వైసీపీ ప్రచారం చేయిస్తున్నారని వారిని విధులకు దూరంగా ఉంచాలని నిమ్మగడ్డ రమేశ్ ఫిర్యాదు చేశారు. వాస్తవానికి వాలంటీర్లంతా వైసీపీ కార్యకర్తలేనని చెప్పింది మీరు, మీ మంత్రులే కదా?. వారితో ఎన్నికల ప్రచారం చేయిస్తున్న మాట నిజం కాదా? దానిపైనే రమేశ్ ఫిర్యాదు చేశారు.
అందుకే వాలంటీర్లతో నగదు పంపిణీ చేయించొద్దని కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు ఇచ్చింది. దానికి రక్తపు రంగులద్ది ప్రతిపక్షం పైకి నెట్టేసే కుట్రకు తెరతీసి అవ్వాతాతలకు పింఛన్ ఇవ్వకుండా చంద్రబాబు అడ్డుపడుతున్నారంటూ దుష్ప్రచారం చేయడం ఏంటి? ప్రతి నెలా ఒకటో తేదీనే పింఛన్ ఇస్తున్నామని చెప్పిన జగన్ ఈసారి అందుకు సరిపడా డబ్బును ఖజానాలో ఎందుకు ఉంచలేదో చెప్పాలి.
పైగా సకలశాఖల మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి 3వ తేదీ నుంచి పింఛను ఇస్తామని ప్రకటించారు కదా. అధికారులు ఇదే మాట చెప్పారు కదా. చేసిందంతా చేసి మీ చేతగానితనాన్ని తెలుగుదేశంపై నెట్టి ఏడుస్తారెందుకు జగన్. మరోవైపు ఎప్పటిలాగే తాను చిత్తూరు జిల్లాను ఉద్ధరించినట్లు కట్టుకథల్ని జగన్ సభలో వల్లెవేశారు.
వైఎస్సార్సీపీ ముసుగులో సీఎస్ జవహర్ రెడ్డి! - పింఛను సొమ్ము ఇంటి వద్దకు వెళ్లి పంపిణీ చేయకుండా కుట్ర? - Door To Door Pension Distribution
పనిలోపనిగా తెలుగుదేశం, బీజేపీ, జనసేన పొత్తులపై విమర్శలు చేశారు. అందరూ కలిసి తనపై యుద్ధానికి వస్తున్నారంటూ మొసలికన్నీరు కార్చారు. పూతలపట్టు కరవు ప్రాంతమని నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి సునీల్‌కుమార్ ప్రస్తావించగా నివారణకు ఎటువంటి చర్యలు తీసుకుంటారన్న అంశాన్ని జగన్ కనీసం ప్రస్తావించలేదు. వైసీపీ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులను పరిచయం చేసి ఆశీర్వదించాలని కోరారు.
జనం లేక బహిరంగ సభ వెలవెలబోయింది. సాయంత్రం 5 గంటలకు ప్రారంభమైన బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగం ప్రారంభం కాకముందే జనం సభా ప్రాంగణం నుంచి వెళ్లిపోయారు. జగన్ ప్రసంగిస్తున్నంత సేపు జనం బయటకు వెళ్లి పోవడమే కనిపించింది. జగన్ ప్రసంగాన్ని సైతం జనం వినకుండా అక్కడి నుంచి నిష్క్రమించారు.