CM Chandrababu Will Change Vijayawada Before And After Floods :వరద విపత్తు వల్ల విజయవాడకొచ్చిన సంక్షోభాన్ని అవకాశంగా మలుచుకుని డిజిటల్ సాధికారతను పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. వరదలకు ముందు, ఆ తర్వాత అనేలా నగరాన్ని అభివృద్ధి చేస్తామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. వరద బాధితులకు అండగా నిలవాలని ఇతర ప్రాంతాల ప్రజలకు పిలుపునిచ్చారు. నష్టంపై ఇవాళ కేంద్రానికి ప్రాథమిక నివేదిక పంపుతామని ఆయన వెల్లడించారు.
డిజిటల్ సాధికారతను పెంచుతాం : హుద్‌హుద్ తుపాను తర్వాత విశాఖ ముఖచిత్రం సమూలంగా మారిందని ముఖ్యమంత్రి చంద్రబాబు గుర్తు చేశారు. అదే తరహాలో ఇప్పుడు విజయవాడ గురించి అందరూ మాట్లాడుకునేలా చేస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు. విపత్తుని అవకాశంగా మార్చుకుని డిజిటల్ సాధికారతను పెంచుతామని స్పష్టం చేశారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలపై ఎప్పటికప్పుడు ప్రజాభిప్రాయం సేకరిస్తున్నానన్న సీఎం బాధితులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని తెలిపారు.
బుడమేరుకు మూడు బుంగలు వస్తే గుర్తు పట్టలేని గత ప్రభుత్వ వ్యక్తులు. అది అప్పట్లో పూర్తి చేసి ఉంటే ఇప్పుడు ఇంత నష్టం వచ్చేదికాదు. ఇప్పుడు కూడా ఎదురుదాడి చేస్తున్నారే తప్ప వాళ్లలో తప్పు జరిగిందనే బాధలేదు. బుడమేరును మొత్తం ఆక్రమించేసి, ప్రైవేటుగా కూడా కబ్జాలు చేసేశారు. దాని వల్ల నీళ్లు పోలేని పరిస్థితి రావడంతో విజయవాడ ప్రజలకు శాపంగా మారింది. - చంద్రబాబు , రాష్ట్ర ముఖ్యమంత్రి.