ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రజలు మంచిగా ఆలోచిస్తే రాష్ట్రానికి తిరుగులేదు: సీఎం చంద్రబాబు - CM CHANDRABABU VISIT TO KANDUKUR

నెల్లూరు జిల్లా కందుకూరులో సీఎం చంద్రబాబు పర్యటన - కందుకూరులో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న సీఎం

CM Chandrababu
CM Chandrababu (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 15, 2025, 3:29 PM IST

Updated : Feb 15, 2025, 7:14 PM IST

CM Chandrababu Visit to Kandukur:ఏపీని స్వచ్ఛాంధ్రగా చేయాలని సంకల్పించామని, పరిసరాలు శుభ్రంగా ఉంచేందుకు నెలలో ఒక్కరోజు కేటాయించాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. నెల్లూరు జిల్లా కందుకూరులో చంద్రబాబు పర్యటించారు. కందుకూరులో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కందుకూరులో మెటీరియల్ రికవరీ ఫెసిలిటీ సెంటర్‌ను ప్రారంభించిన సీఎం, దూబగుంటలో గ్రామస్థులతో కలిసి పారిశుద్ధ్య కార్యక్రమంలో పాల్గొన్నారు.

మన ఆరోగ్యం మన చేతుల్లోనే: కందుకూరు వ్యవసాయ మార్కెట్ యార్డు ఆవరణలో స్టాళ్లను పరిశీలించిన సీఎం, స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్రలో భాగంగా ప్రజలతో ముఖాముఖి నిర్వహించారు. వేస్ట్ టు వెల్త్ అనేది తన నినాదమని ముఖ్యమంత్రి అన్నారు. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉందని, క్రిమిసంహారక మందులు వాడిన ఆహారం తినాల్సి వస్తుందని అన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతామని ప్రజలతో సీఎం చంద్రబాబు ప్రతిజ్ఞ చేయించారు.

నెలలో ఒక్కరోజు కేటాయించండి:స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్రలో భాగం కావాలని మీ దగ్గరికి వచ్చానన్న సీఎం, స్వచ్ఛాంధ్రలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికీ అభినందనలు తెలిపారు. పరిసరాలు శుభ్రంగా ఉంచేందుకు ప్రతి ఒక్కరూ పని చేయాలని పిలుపునిచ్చారు. ఏపీని స్వచ్ఛాంధ్రగా చేయాలని సంకల్పించామన్న సీఎం, పరిసరాలు శుభ్రంగా ఉంచేందుకు నెలలో ఒక్కరోజు కేటాయించాలని కోరారు. ప్రజలు మంచిగా ఆలోచిస్తే రాష్ట్రానికి తిరుగులేదని స్పష్టం చేశారు.

చెత్తను పునర్వినియోగం చేసేందుకు: నేరస్తుల పట్ల కఠినంగా ఉంటామని, ఎవరైనా ఆడబిడ్డల జోలికి వస్తే వదిలిపెట్టమని హెచ్చరించారు. గంజాయి ఉత్పత్తి చేస్తే ఉపేక్షించేది లేదని తేల్చిచెప్పారు. పట్టణాల్లో 85 లక్షల మెట్రిక్ టన్నుల చెత్త పేరుకుపోయిందని, అక్టోబర్ 2 నాటికి చెత్త తొలగించే బాధ్యతను మున్సిపల్‌శాఖకు అప్పగించామని పేర్కొన్నారు. చెత్తను పునర్వినియోగం చేసేందుకు కృషి చేస్తున్నామన్న చంద్రబాబు, చెత్త నుంచి సంపద సృష్టించేందుకు ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో 50 శాతం పచ్చదనం పెంపునకు యత్నిస్తున్నామని చెప్పారు.

ఆర్థిక ఇబ్బందులు ఉన్నా 64 లక్షల మందికి పింఛన్: ప్రతినెల పేదల సేవలో ప్రభుత్వం కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని చంద్రబాబు తెలిపారు. రాష్ట్రానికి ఆర్థిక ఇబ్బందులు ఉన్నా 64 లక్షల మందికి పింఛన్ ఇస్తున్నామన్న సీఎం, ఏడాదికి రూ.33 వేల కోట్లు పింఛన్ల రూపంలో ఇస్తున్నామని వెల్లడించారు. ఇబ్బందుల్లో ఉన్న వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసానిచ్చారు.

సంక్షేమాన్ని పరుగులు పెట్టించాలనే సంకల్పం ఉన్నా: ప్రజల్లో ఉత్సాహం చూస్తే తనకు ఎక్కడ లేని ధైర్యం వస్తుందని చంద్రబాబు పేర్కొన్నారు. ప్రజలకు సేవలు అందించడమే తన లక్ష్యమని అన్నారు. గత ప్రభుత్వం రూ.10 లక్షల కోట్ల అప్పు చేసిందని, వాటికి అసలు, వడ్డీలు కట్టాలని తెలిపారు. అప్పులు చెల్లించాలని కొందరు ప్రభుత్వ కార్యాలయాలకు వస్తున్నారన్న చంద్రబాబు, తమ ప్రభుత్వం వచ్చిన 8 నెలల్లోనే అభివృద్ధిని పరుగులు పెట్టించామని చెప్పారు. సంక్షేమాన్ని పరుగులు పెట్టించాలనే సంకల్పం ఉన్నా ఖజానా ఖాళీగా ఉందని అన్నారు.

పథకాల అమలుపై ప్రజల అభిప్రాయం సేకరిస్తున్నాం: గత ప్రభుత్వం రోడ్లపై ఉన్న గుంతలు పూడ్చేందుకు మట్టి కూడా వేయలేదని మండిపడ్డారు. తమ ప్రభుత్వం రాగానే రోడ్ల మరమ్మతులకు రూ.1600 కోట్లు కేటాయించామని గుర్తు చేశారు. సంక్షేమ పథకాల అమలుపై ప్రజల అభిప్రాయం సేకరిస్తున్నామని, వినూత్నమైన ఆలోచనలతో ప్రభుత్వం ముందుకెళ్తుందని తెలిపారు. అంతకుముందు కందుకూరు చేరుకున్న సీఎంకు మంత్రి నారాయణ, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు స్వాగతం పలికారు.

గిరిజనుల హక్కులు కాపాడతాం - 1/70 చట్టం తొలగించం: చంద్రబాబు

Last Updated : Feb 15, 2025, 7:14 PM IST

ABOUT THE AUTHOR

...view details