Chandrababu on HMPV Cases : దేశంలో హెచ్‌ఎంపీవీ కేసుల నమోదైన వేళ రాష్ట్రంలోనూ అప్రమత్తంగా ఉండాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. గుజరాత్, కర్ణాటకల్లో కేసులు నమోదైనందున అలర్ట్గా ఉండాలని చెప్పారు. హెచ్ఎంపీవీ వైరస్ వ్యాప్తి అంశంపై వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారులతో ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఏపీలో ఈ కేసులు పెరగకుండా చూడాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.
హెచ్‌ఎంపీవీ వైరస్ అంత ప్రమాదకరం కాదన్న అధికారులు 2001 నుంచి ఈ వైరస్ ఉందని ముఖ్యమంత్రికి తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో ఇప్పటి వరకూ ఒక్క కేసూ నమోదు కాలేదని వివరించారు. అయినా ఆక్యూట్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ లాంటి శ్వాసకోస వ్యాధులు, ఇన్ ఫ్లూయెంజా లాంటి కేసుల్లో అప్రమత్తత అవసరమని చంద్రబాబు సూచించారు. మైక్రోబయాలజిస్ట్‌లు, పీడియాట్రీషియన్లు, పల్మనాలజిస్టులు, ప్రివెంటివ్ మెడిసిన్ నిపుణులతో టాస్క్‌ఫోర్సు కమిటీ నియమించి వారి సలహాలు తీసుకోవాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఐసీఎంఆర్ అధీకృత వైరాలజీ ల్యాబ్‌లను సిద్ధం చేయాలని టెస్టింగ్ కిట్లను సిద్ధం చేసుకోవాలని సూచనలు చేశారు. తక్షణం 3000ల టెస్టింగ్ కిట్లను తెప్పించుకోవాలని ఆదేశాలిచ్చారు. ఔషధాల లభ్యతపైనా ముఖ్యమంత్రి ఆరా తీశారు.
HMPV Virus Cases : రాష్ట్రంలో 4.5 లక్షల ఎన్95 మాస్కులు, 13.71 లక్షల ట్రిపుల్ లేయర్డ్ మాస్కులు , 3.52 లక్షల పీపీఈ కిట్లు ఉన్నట్టు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. వీటి సరఫరాను పెంచాలన్న సీఎం శానిటైజర్లనూ సిద్ధం చేయాలని సూచించారు. హెచ్ఎంపీవీ వైరస్ చికిత్సకు వినియోగించే రిబావిరిన్ ఔషధాన్ని కొనుగోలు చేయాలని, ఏపీఎంఎస్ఐడీసీ సరఫరా చేసేంతవరకూ స్థానికంగా తెప్పించుకోవాలని చెప్పారు. చిన్నారులు, రోగనిరోధకశక్తి తక్కువ ఉండే రోగులకు హెచ్ఎంపీవీ ఇబ్బందిగా పరిణమించే ప్రమాదం ఉన్నందున జాగ్రత్తలు అవసరమని చంద్రబాబు పేర్కొన్నారు.