CM Chandrababu Started Distribution of Pensions :ఏపీరాష్ట్రవ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమం ఘనంగా ప్రాంభమైంది. మంగళగిరి నియోజకవర్గంలోని పెనుమాకలో లబ్ధిదారులకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా పింఛను అందించారు. ఇంటింటికి వెళ్లి చంద్రబాబు లబ్ధిదారులకు ఫించన్ పంపిణీ చేశారు. అలాగే వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. సీఎం చంద్రబాబుతో పాటు మంత్రి లోకేశ్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
మేనిఫెస్టోలో హామీ ఇచ్చినట్లు పింఛను పెంపు ఏప్రిల్ నుంచే అమలు చేస్తున్నారు. నేడు రాష్ట్ర వ్యాప్తంగా 65.31 లక్షల మందికి పింఛన్ల పంపిణీ చేస్తున్నారు. మొత్తం 28 విభాగాలకు చెందిన లబ్దిదారులకు పెంచిన పింఛను అందజేస్తున్నారు. పెరిగిన పింఛను 4వేల రూపాయలతో పాటు గత మూడు నెలల సొమ్ము రూ.3000 కలిపి మొత్తం 7వేల రూపాయలను ప్రభుత్వం పంపిణీ చేస్తోంది.
Pensions Increased in AP :వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, చేనేత, కల్లుగీత కార్మికులు, మత్స్య కారులు, కళాకారులు, డప్పు కళాకారులు, ట్రాన్స్‌జెండర్స్ వంటి వారికి ఇకపై 4వేల రూపాయల పింఛను అందనుంది. దివ్యాంగులకు రూ. 3వేల నుంచి ఒకేసారి రూ.6 వేలు చేయగా, తీవ్ర అనారోగ్యంతో బాధపడేవారికి రూ. 5 వేలు నుంచి రూ.15వేలు చేస్తూ నిర్ణయం చేశారు. ఈ విభాగంలో 24318 మంది పింఛను అదనంగా పొందనున్నారు. పెండింగ్ బకాయిలు కలిపి రూ.7వేలు చొప్పున ఫించన్లు అందజేయడంపై లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.