CM Chandrababu Sankranti Celebrations in Naravaripalle: సీఎం చంద్రబాబు స్వగ్రామం నారావారిపల్లెలో సంక్రాంతి వేడుకల్లో భాగంగా సోమవారం భోగి పండుగను ఘనంగా నిర్వహించారు. భోగి సందర్బంగా భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలు భావితరాలకు తెలియజేసే విధంగా చంద్రబాబు నాయుడు, ఆయన కుటుంబ సభ్యులు నారావారిపల్లెలో పిల్లలకు ఆటల పోటీలు, మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ పోటీలను సీఎం చంద్రబాబు, భువనేశ్వరి దంపతులు, మంత్రి లోకేశ్, బ్రాహ్మణి దంపతులు, బాలకృష్ణ సతీమణి వసుంధర, ఇతర కుటుంబసభ్యులు వీక్షించారు. లోకేశ్ కుమారుడు దేవాంశ్ కూడా ఈ పోటీల్లో పాల్గొన్నాడు.
అందరికీ రూ.10,116 చొప్పున బహుమతులు:గ్రామంలో మహిళలు పాల్గొని వేసిన రంగవల్లులను చంద్రబాబు ఆయన సతీమణి నారా భువనేశ్వరి, కోడలు బ్రాహ్మణి, నందమూరి కుటుంబ సభ్యులు పరిశీలించారు. అదే విధంగా గ్రామంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. మహిళలకు ముగ్గుల పోటీలలో సీఎం చంద్రబాబు, భువనేశ్వరి, బ్రాహ్మణి విజేతలకు బహుమతులు అందజేశారు. మహిళలకు పోటీలు నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని భువనేశ్వరి అన్నారు. ఈ పోటీలలో పాల్గొన్న మొత్తం 126 మందికి కూడా రూ. 10,116 చొప్పున అందిస్తానని, ఇది డబ్బు విలువ కట్టడం కాదని పేర్కొన్నారు. పోటీలో పాల్గొన్న వారిని చూసి సంతోషం కలిగి ఇస్తున్నానని పేర్కొన్నారు. ముగ్గుల పోటీల్లో అందరూ చాలా కష్టపడ్డారని, పాల్గొన్న ప్రతి ఒక్కరూ గెలిచినవారేనని నారా బ్రాహ్మణి అన్నారు.