CM Chandrababu Will Start Free Gas Cylinder Scheme :సూపర్ సిక్స్ హామీల్లో ఒకటైన ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని దీపావళి పండుగ కానుకగా ఏపీ ప్రభుత్వం అమలు చేసిన విషయం తెలిసిందే. 29వ తేదీ నుంచి ప్రభుత్వం ఈ పథకం కింద గ్యాస్ బుక్ చేసుకునే అవకాశాన్ని లబ్ధిదారులకు కల్పించింది. నేడు శ్రీకాకుళం జిల్లా ఈదుపురం గ్రామంలో దీపం-2 పథకం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయడు లాంఛనంగా ప్రారంభించబోతున్నారు. అర్హులైన లబ్ధిదారులకు ఉచితంగా గ్యాస్ సిలిండర్లను సీఎం పంపిణీ చేయనున్నారు.
ఈ మేరకు ఉండవల్లి నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు ఉత్తరాంధ్ర పర్యటనకు బయలుదేరారు. శుక్రవారం, శనివారం ఉత్తరాంధ్ర జిల్లాల్లో సీఎం పర్యటన జరుగనుంది. నేటి నుంచి దీపం 2 పథకం ప్రారంభంకానుంది. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గంలో ఈదుపురం గ్రామంలో ముఖ్యమంత్రి చంద్రబాబు లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఉచిత గ్యాస్ సిలిండర్లను లబ్ధిదారులకు అందించనున్నారు. ఎన్టీఆర్ భరోసా ఫించన్‌ను లబ్ధిదారులకు సీఎం అందించనున్నారు. ప్రజల నుంచి వినతులు తీసుకుని, రైతులతో ముఖాముఖి నిర్వహించనున్నారు. జిల్లా అధికారులు, మంత్రులతో సీఎం సమీక్షించనున్నారు. రాత్రికి శ్రీకాకుళంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు బస చేయనున్నారు.
ఫ్రీ గ్యాస్ సిలిండర్ కావాలా - ఇలా బుక్ చేసుకోండి
ఏలూరు జిల్లా పర్యటనలో ఉప ముఖ్యమంత్రి:మరోవైపు ఏలూరు జిల్లా ఐఎస్ జగన్నాధపురంలో ఉచిత సిలిండర్లను లబ్ధిదారులకు ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అందించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మంత్రులు, ఎమ్మెల్యేలు ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు. సూపర్ సిక్స్ హామీలను నెరవేర్చే దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. దీపం 2 పథకానికి సంవత్సరానికి 2 వేల 684 కోట్లు ఖర్చు పెట్టనుంది. మొదటి విడతగా 894 కోట్లను పెట్రోలియం సంస్థలకు ముఖ్యమంత్రి చంద్రబాబు అందజేశారు. ప్రతి నాలుగు నెలలకి ఒక ఉచిత సిలిండర్ చొప్పున సంవత్సరానికి మూడు సిలిండర్ల అందజేయనున్నారు. తెల్ల రేషన్ కార్డు ఉన్న వారందరూ దీపం 2 పథకానికి అర్హులేనని తెలిపారు.