Chandrababu Vijayawada Tour : వరద ముంపు ప్రాంతాల్లో దాదాపు నాలుగు గంటల పాటు నిర్విరామంగా పర్యటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు విజయవాడ కలెక్టరేట్‌లో మంత్రులు, ఉన్నతాధికారులతో మరోమారు సమీక్ష నిర్వహించారు. అంబాపురంలో ఒక కుటుంబం వద్దకు వెళ్లినప్పుడు పిల్లలకు మంచినీరు కూడా అందించలేని పరిస్థితిని చూశానని చెప్పారు. క్షేత్రస్థాయిలో పర్యటించినప్పుడు తాగటానికి నీళ్లు లేవంటూ ఎక్కువ మంది నుంచి ఫిర్యాదులు వచ్చాయన్నారు.
CM Chandrababu Tour On JCB :నేటి నుంచి మరిన్ని వాటర్ బాటిళ్లు పంపిణీ చేస్తామని చంద్రబాబు చెప్పారు. ట్యాంకర్లతో నీళ్లు సరఫరా ప్రారంభిస్తామన్నారు. ఈ సాయంత్రానికి అన్ని రక్షిత తాగునీటి పథకాల నుంచి నీళ్లు విడుదల చేస్తామని వెల్లడించారు. ప్రతి వార్డులో వెయ్యి కుటుంబాలకు ఒకరిని నియమిస్తామని తెలిపారు. వారికి సెల్‌ఫోన్ ఇచ్చి అందరికీ ఆహారం సరఫరా అయిందో లేదో తెలుసుకుంటామని చంద్రబాబు వివరించారు.
అగ్నిమాపక శకటాల్ని తెప్పిస్తున్నాం : వరదలో మునిగి ద్విచక్రవాహనాలు, కార్లు, ఆటోలు, ఇతర వాహనాలు పాడయ్యాయని చంద్రబాబు చెప్పారు. బీమా చెల్లింపుపై బుధ, గురువారాల్లో బ్యాంకర్లు, బీమా కంపెనీల ప్రతినిధులతో సమావేశం నిర్వహిస్తామన్నారు. ముంపు బారిన పడ్డ నివాసాలను శుభ్రపరిచే బాధ్యతల్ని అగ్నిమాపక శాఖకు అప్పగించామని తెలిపారు. అన్ని ప్రాంతాల నుంచి అగ్నిమాపక శకటాల్ని తెప్పిస్తున్నామని చంద్రబాబు వెల్లడించారు.
నేటి నుంచి వరద ప్రభావిత ప్రాంతాల్లో వైద్యశిబిరాలు నిర్వహిస్తామని చంద్రబాబు వెల్లడించారు. వైరల్ జ్వరాలు వచ్చే ప్రమాదం పొంచి ఉన్నందున ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలి? ఎలా ఉండాలి? ఎలా ఉండకూడదు? అనే విషయాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ కరపత్రాలు పంపిణీ చేస్తామని చెప్పారు. వరద బాధితులకు ఇచ్చే ఆహారాన్ని విసరడంతో కొంత నీటిలో పడుతుందోందని అది సరికాదని వ్యాఖ్యానించారు. బాధితులు దాన్ని తీసుకుని తినడం వల్ల వ్యాధులు ప్రబలే అవకాశం ఉందన్నారు. పండ్లు, నీరు, ఆహారాన్ని గౌరవప్రదంగా చేతికి అందించాలని చంద్రబాబు కోరారు.