CM Chandrababu at Indian Navy Operational Demonstration:నేవీ డే ఉత్సవాల్లో భాగంగా విశాఖ సముద్రతీరంలో నిర్వహించిన విన్యాసాలు చూపరులను అబ్బురపరిచాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీఎం చంద్రబాబు నాయుడు సహా ఆయన సతీమణి భువనేశ్వరి, మనవడు దేవాన్ష్ హాజరయ్యారు. సీఎం చంద్రబాబుకు నావికాదళ సిబ్బంది గౌరవ వందనం చేశారు.
విశాఖ ఆర్‌కే బీచ్‌లో తూర్పు నావికాదళం నిర్వహించిన సైనిక విన్యాసాలకు స్థానికులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. విన్యాసాలు చూసేందుకు వచ్చిన వారితో ఆర్కే బీచ్ రద్దీగా మారింది. ముఖ్య అతిథిగా హాజరైన చంద్రబాబుకు పారా గ్లైడర్ జ్ఞాపికను అందించారు. సీఎం చంద్రబాబుతో కలిసి ఆయన సతీమణి భువనేశ్వరి, మనవడు దేవాన్ష్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జనగణమనతో సైనిక విన్యాసాలు ప్రారంభమయ్యాయి.
సందర్శకులను హెలికాప్టర్ విన్యాసాలు, హాక్ యుద్ధవిమానాలు ఆకట్టుకున్నాయి. డోర్నియర్, బోయింగ్ విమాన విన్యాసాలతో నావికాదళం తన శక్తిని ప్రదర్శించింది. గాల్లో ఎగురుతున్న హెలికాప్టర్ నుంచి నేరుగా సముద్రంలోని పడవలోకి దిగిన సైనికులు ఉగ్రవాదుల చేతుల్లో బంధీలుగా ఉన్నవారిని సురక్షితంగా ఎలా రక్షిస్తారో ప్రదర్శించి చూపించారు. శత్రువుల ఆయిల్ రిగ్ నమూనాలను సైనికులు ఎలా ధ్వంసం చేస్తారో ప్రత్యక్షంగా చూపించడం ఎంతగానో ఆకట్టుకుంది. యుద్ధభూమిలో వేగంగా దూసుకుపోయే ట్యాంకర్లు భారీ పడవలు నేవీడే ప్రదర్శనలో పాల్గొని విన్యాసాలు చేశాయి. నేవీ బ్యాండ్ సంగీత ప్రదర్శనతో సందర్శకులు మంత్రముగ్దులయ్యారు. నావికుల విన్యాసాలను సీఎం చంద్రబాబు ఆసక్తిగా తిలకించారు.
ఈ పర్యటన చాలా సంతోషకరంగా ఉంది: అనంతరం సీఎం చంద్రబాబు ప్రసంగించారు. విశాఖకు ఎన్నోసార్లు వచ్చినా ఈ పర్యటన చాలా సంతోషకరంగా ఉందని సీఎం చంద్రబాబు అన్నారు. నావికాదళ విన్యాసాలు అద్భుతంగా ఉన్నాయని ప్రశంసించారు. నావికాదళానికి అభినందనలు తెలిపి, వారి ధైర్యానికి హ్యాట్సాఫ్ చెప్పారు. నావికాదళ క్రమశిక్షణ చూస్తే ఎంతో ముచ్చటేస్తుందన్న సీఎం, పాకిస్తాన్‌తో యుద్ధంలో విశాఖ నావికాదళం కీలకపాత్ర పోషించిందని గుర్తు చేసుకున్నారు. తన జీవితంలో విశాఖపట్నానికి ఎంతో ప్రాధాన్యం ఉందన్న సీఎం, హుద్‌హుద్ సమయంలో నేవీ సాయం మరువలేనిదని కొనియాడారు.