CM Chandrababu visit Tirupati Stampede Place :తిరుపతిలో ప్రమాద స్థలాన్ని సీఎం చంద్రబాబు పరిశీలించారు. తొక్కిసలాట పరిసర ప్రాంతాలు పరిశీలించిన సీఎం చంద్రబాబు వెంట పలువురు మంత్రులు, స్థానిక నేతలు ఉన్నారు. తొక్కిసలాట ఘటన గురించి సీఎం చంద్రబాబుకు టీటీడీ అధికారులు వివరించారు. చంద్రబాబు వెంట మంత్రులు అనగాని సత్యప్రసాద్, వంగలపూడి అనిత, ఆనం రామనారాయణరెడ్డి, నిమ్మల రామానాయుడు తదితరులు ఉన్నారు.
రద్దీ పెరుగుతుంటే ఏం చేస్తున్నారు:అధికారులను అడిగి సీఎం చంద్రబాబు వివరాలు తెలుసుకున్నారు. టీటీడీ అధికారులు చేసిన ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా టీటీడీ ఈవో, అధికారులపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. వారితో పాటు కలెక్టర్, పోలీసు అధికారులపై సైతం మండిపడ్డారు. భక్తుల రద్దీ పెరుగుతుంటే టీటీడీ అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. అంబులెన్స్‌ల లభ్యత గురించి ఆరా తీశారు. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు.
జేఈవోగా మీ బాధ్యత గుర్తులేదా :ఈ క్రమంలో టీటీడీ జేఈవో గౌతమిపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. జేఈవోగా మీ బాధ్యత గుర్తు లేదా అని ప్రశ్నించారు. భక్తుల రద్దీ చూసి టికెట్లు ఇవ్వాలని తెలియదా అని మండిపడ్డారు. భక్తుల నుంచి ఫిర్యాదులు వచ్చాక ఏం చేశారని అలానే తొక్కిసలాట జరిగాక సహాయ చర్యలు ఎలా చేపట్టారని ప్రశ్నించారు. వాట్సప్ ద్వారా సిబ్బందికి ఆదేశాలు ఇవ్వలేరా అని జేఈవోను సీఎం చంద్రబాబు అడిగారు.