Chandrababu Hundred Days Ruling :ముఖ్యమంత్రిగా అధికార పగ్గాలు చేపట్టే నాటికి రాష్ట్ర ఖజానా దివాలా తీసినా, అభివృద్ధి, సంక్షేమ ఫలాలను ప్రజలకు అందించే విషయంలో చంద్రబాబు దృఢచిత్తంతో ముందుకు సాగుతున్నారు. పెన్షన్లు ఓకేసారి రూ.1000 చొప్పున పెంచి మాట నిలబెట్టుకున్నారు. బకాయిలు రూ.3000లు కలిపి రూ.7000ల చొప్పున 64 లక్షల మందికి పైగా ఇచ్చి చరిత్ర సృష్టించారు. 16,437 ఉపాధ్యాయ నియామకాలకు మెగా డీఎస్సీకి చర్యలు తీసుకున్నారు.
అన్న క్యాంటీన్లను పునరుద్ధరణ :పేదల ఆకలి తీర్చేందుకు రాష్ట్రవ్యాప్తంగా 100పైగా అన్న క్యాంటీన్లను పునరుద్ధరించారు. ఆగస్టు 15న తొలిదశ కింద లాంఛనంగా వీటిని ప్రారంభించి, మలిదశలో మరో 75 క్యాంటీన్లు అందుబాటులోకి తెచ్చారు. రూ.15,000ల కోట్లు రాజధాని నిర్మాణానికి రుణం వచ్చేలా, పోలవరం ప్రాజెక్టు మొదటి దశ పూర్తి కావడానికి రూ.12,000ల కోట్లు ఇవ్వడానికి కేంద్ర కేబినెట్ అంగీకరించేలా కృషి చేశారు. అమరావతి అవుటర్ రింగ్ రోడ్డు, రైల్వే లైన్‌కు కేంద్ర ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది.
ల్యాండ్ టైటిలింగ్ యాక్టును రద్దు చేసి ప్రజల ఆస్తులకు చంద్రబాబు రక్షణ కల్పించారు. డ్వాక్రా మహిళలకు వడ్డీ లేని రుణాలు రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచారు. కర్నూలు జిల్లా ఓర్వకల్లు, కడప జిల్లా కొప్పర్తి పారిశ్రామిక పార్కులను కేంద్రం ఆమోదించేలా ఆయన చొరవ చూపారు. ఉత్తరాంధ్ర, రాయలసీమలోని 7 వెనుకబడిన జిల్లాలకు కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రత్యేక నిధులు కేటాయించగా, ప్రకాశం జిల్లాను ఈ జాబితాలో చేర్చించారు. విశాఖ రైల్వే జోన్‌కు 52 ఎకరాలు పూర్తి హక్కులతో కేటాయింపులు చేశారు. పంచాయతీలకు రూ.1452 కోట్లు, రైతులకు ధాన్యం బకాయిలు రూ.1674 కోట్లు విడుదల చేశారు.
ఆరోగ్యశ్రీకి జగన్ రూ.1600 కోట్లు బకాయిలు పెట్టగా ఇప్పటి వరకు రూ.700 కోట్లు ప్రభుత్వం చెల్లించింది. నీరు-చెట్టు బకాయిలు రూ.256 కోట్లు, రాజధాని కౌలు రైతుల బకాయిలు రూ.400 కోట్లు, పేదల గృహనిర్మాణ బకాయిలు రూ.50 కోట్లు చెల్లించారు. రేషన్ దుకాణాల్లో బియ్యంతోపాటు పంచదార, గోధుమపిండి ఇస్తున్నారు. కంది పప్పు ధర మార్కెట్‌లో రూ.180 ఉంటే దాన్ని ప్రత్యేక కౌంటర్ల ద్వారా రూ.150కి తగ్గించారు. ఉచిత ఇసుక విధానాన్ని ప్రవేశపెట్టారు. ఆన్లైన్ బుకింగ్ కోసం ప్రత్యేక పోర్టల్, యాప్‌ను అందుబాటులోకి తెచ్చారు. నూతన ఎక్సైజ్ విధానం ద్వారా మద్యం ధరలు తగ్గుదలకు నిర్ణయం తీసుకున్నారు.
Chandrababu100 Days Rule in AP :చేనేత వృత్తిదారులకు జీఎస్టీ ఎత్తివేత హామీ ఇచ్చారు. మత్స్యకారుల ఉపాధిని దెబ్బతీసే 217 జీవోను రద్దు చేశారు. అర్చకుల వేతనాలు రూ.10,000ల నుంచి రూ.15,000లకు, నాయి బ్రాహ్మణుల వేతనాలు రూ.15,000ల నుంచి రూ.25,000లకు పెంచారు. ఉపాధి హామీ పథకం ద్వారా 6.50 కోట్ల పనిదినాలు పెంచడం వల్ల 54 లక్షల మందికి అదనంగా లబ్ధి చేకూరింది. ప్రభుత్వ ఉద్యోగులకు 1వ తేదీనే జీతాలు ఇస్తున్నారు.