CJI Laid Foundation Stone for Court Building in Hyderabad :సత్వర న్యాయం కావాలని యువభారతం ఆశిస్తోందని, సమాజంలోని అన్ని వర్గాలకు కోర్టులు చేరువ కావాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ పేర్కొన్నారు. భారత్‌లో యువత సంఖ్య చాలా ఎక్కువగా ఉందని, వేగంగా మార్పులు కోరుకుంటున్నారని అన్నారు. ఇవాళ రాజేంద్రనగర్‌లో నూతన హైకోర్టు భవనానికి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కింది కోర్టుల్లోనే కాదు హైకోర్టుల్లోనూ మౌలిక సౌకర్యాల కొరత ఉందని అన్నారు. ఇటీవల ఈ కోర్టు పథకంలో భాగంగా పలుచోట్ల ఈ సేవ కేంద్రాలు ఏర్పాటు చేశారని తెలిపారు.
CJI on Court Building in Hyderabad : సాంకేతిక యుగంలో కోర్టు కార్యకలాపాలకు ఇంటర్నెట్ వాడుకోవాలని సీజేఐ చంద్రచూడ్ సూచించారు. బ్రిటీష్ కాలంలో కోర్టులు సార్వభౌమత్వాన్ని కలిగి ఉండేవని, మారిన కాలంతో కోర్టుల్లోనూ మార్పులు వస్తున్నాయని వ్యాఖ్యానించారు. ప్రజలకు న్యాయ సేవలు మరింత చేరువయ్యేలా మార్పులు రావాలని ఆకాంక్షించారు. హైదరాబాద్‌లో కొత్త హైకోర్టు కోసం చొరవ తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం, హైకోర్టు సీజేను అభినందిస్తున్నట్లు సీజేఐ పేర్కొన్నారు. కొత్త భవనంలో స్త్రీలు, దివ్యాంగులు వంటి విభిన్న వర్గాలకు సౌకర్యాలుండాలన్న ఆయన, జిల్లా కోర్టుల్లో ఎక్కువగా మహిళలు నియమితులవుతున్నారని తెలిపారు.