Good News to Ration Card Holders : అంత్యోదయ అన్నయోజన రేషన్ కార్డులు ఉన్నవారికి తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు అందించింది. రాష్ట్ర సర్కార్ తీసుకున్న నిర్ణయంతో AAY రేషన్ కార్డు ఉన్నవారికి మరింత లబ్ది చేకూరనుంది. ఇంతకీ.. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఆ నిర్ణయమేంటి? అందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
కేంద్ర ప్రభుత్వం దారిద్య్రరేఖకు దిగువన ఉన్న కుటుంబాల కోసంఅంత్యోదయ అన్న యోజన(AAY) పథకాన్ని ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ పథకం కింద అర్హులైన వారికి నెలనెలా ఒక్కో కుటుంబానికి సబ్సిడీపై 35 కిలోల బియ్యం లేదా గోధుమలు పంపిణీ చేయడం జరుగుతోంది. వీటితోపాటు వారికి చక్కెర కూడా పంపిణీ చేస్తారు. అయితే.. తెలంగాణలో(Telangana) చాలా మంది రేషన్ డీలర్లు అంత్యోదయ అన్నయోజన రేషన్ కార్డు ఉన్నవారి బియ్యం, గోధుమలు మాత్రమే పంపిణీ చేస్తున్నారు. చక్కెర మాత్రం ఇవ్వడం లేదు. కొందరు డీలర్లయితే డీడీలే తీయకుండా ఉంటున్నారు. మరికొందరు డీడీలు తీసినా చక్కెర రాలేదని సాకులు చెబుతున్నారు.
ఈ విషయం పౌరసరఫరాల శాఖ దృష్టికి చేరింది. దాంతో వెంటనే స్పందించిన పౌరసరఫరాల శాఖ.. రేషన్ డీలర్లకు కీలక ఆదేశాలు జారీ చేసింది. జిల్లాలవారీగా అవసరమైనంత చక్కెర తీసుకుని.. AAY రేషన్ కార్డు ఉన్న లబ్ధిదారులకు పంపిణీ చేయాలని ఆదేశించింది. ఈ నిర్ణయంతో రాష్ట్రంలో ఇకపై అంత్యోదయ అన్న యోజన రేషన్ కార్డు ఉన్నవారికీ చక్కెర అందనుంది.