ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పట్టించుకోకుండా వదిలేశారు - ఏ తల్లికీ రావద్దు ఈ కష్టం

పట్టించుకోని పిల్లలు - దిక్కుతోచక పంచాయతీ కార్యాలయం ఎదుట కూర్చున్న వృద్ధురాలు - పోలీసులకు సమాచారమిచ్చిన స్థానికులు

Children Neglect of Mother
Children Neglect of Mother (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : 15 hours ago

Children Neglect of Mother: ఎంతో కష్టపడి పెంచిన తల్లిదండ్రులే పిల్లలకు బరువు అవుతున్నారు. చివరి మజిలీలో అసరాగా ఉండాల్సిన కడుపున పుట్టిన పిల్లలే కన్నవారిని రోడ్డున పడేస్తున్నారు. అసలే ఓపిక లేక ఎలాంటి ఆధారం లేక వాళ్లు ఎందుకు బతికున్నామురా దేవుడా అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు ప్రతిరోజూ ఎక్కడో ఒకచోట వెలుగు చూస్తూనే ఉన్నాయి.

కనిపెంచి ప్రేమగా చూసుకున్న పాపానికి ఇప్పుడు ఎక్కడ, ఎలా బతకాలో తెలియని పరిస్థితి ఆ అమ్మది. ఈ వయసులో తనకు ఇంత చోటు ఇవ్వాలని పంచాయతీ కార్యాలయం ముందు కూర్చొని ఉంది. వృద్దాప్యంలో ఆ తల్లి బిడ్డలకు భారమైంది. ఇప్పటిదాకా వంతులేసుకొని చూసుకున్న వాళ్లు ఇక మా వల్ల కాదంటూ వదిలేశారు. ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ఆమె పంచాయతీ కార్యాలయాన్ని ఆశ్రయించింది. ఇలాంటి విదారకర ఘటన వరంగల్‌ జిల్లా వర్ధన్నపేట మండలం ఇల్లందలో జరిగింది.

అందరూ ఉన్నా అనాథలా: వరంగల్​ జిల్లా వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామానికి చెందిన దోమకొండ రాజమ్మకు ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అందరికీ పెళ్లిళ్లు అయ్యాయి. ఆమె భర్త పదేళ్ల కిందట కన్నుమూశాడు. ఎనభై ఏళ్ల వయసులో పెద్ద కుమారుడి దగ్గరే ఉండేది. కానీ ఆ కుమారుడు అనారోగ్యంతో మరణించాడు. ఇలాంటి పరిస్థితుల్లో రాజమ్మ బాగోగులను పెద్ద కోడలే చూసుకునేది.

ఇంటి పెద్ద చనిపోవడం, ఆర్థిక ఇబ్బందులతో తాను అత్తను చూడలేనని చెప్పింది. ఆమెను అదే గ్రామంలో ఉంటున్న రెండో కుమారుడి వద్దకు పంపింది. అయితే అతను తన భార్య చనిపోయిందని, చూసుకోలేనని తెలిపారు. ఇలాంటి దిక్కుతోచని స్థితిలో ఆ వృద్ధురాలు వరంగల్​లో ఉంటున్న మూడో కుమారుడికి ఫోన్​ చేసింది. అతని నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. ఏం చేయాలి, ఎక్కడికి వెళ్లాలో తెలియక ఆమె పంచాయతీ కార్యాలయం దగ్గరకు చేరుకుంది.

ఆమె తన దీనపరిస్థితిని గ్రామస్థులు, అధికారులకు చెప్పుకుని విలపించింది. పిల్లలు తనను బతికుండగానే మానసికంగా చంపేస్తున్నారని వాపోయింది. ఇది విన్న స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎస్సై రాజు వచ్చి రాజమ్మ నుంచి వివరాలు తీసుకున్నారు. కుటుంబ సభ్యులను పిలిచి కౌన్సెలింగ్‌ ఇస్తామని స్పష్టం చేశారు. సమస్య పరిష్కరించే వరకు పెద్ద కోడలి వద్దే ఉండాలని చెప్పి ఆమెను పంపించారు.

బంగారం కోసం - కుమార్తె ఇంటి ఎదుట తల్లిదండ్రుల ఆందోళన

కన్నోళ్లపైనే కర్కశం - బిడ్డను నమ్మి రోడ్డుపాలైన వృద్ధ దంపతులు

ABOUT THE AUTHOR

...view details