3rd Phase Crop Loan Waiver in Telangana: ఖమ్మం జిల్లా వైరాలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రూ. లక్షన్నర నుంచి రూ.2 లక్షల్లోపు రుణమాఫీ ప్రకటించారు. అనంతరం పలువురికి మూడో విడత రుణమాఫీ చెక్కులను అందించి, ఆ వెంటనే రైతుల ఖాతాల్లో మాఫీ సొమ్ము జమ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 30 లక్షల మందికి పైగా రైతులను రుణ విముక్తులను చేసేందుకు ప్రభుత్వం రూ.31 వేల కోట్లు కేటాయించింది. రూ.లక్ష వరకు రుణం ఉన్న 11 లక్షల 14 వేల 412 మంది రైతులకు జులై 18న రూ.6034 కోట్లు విడుదల చేసింది. ఆ తర్వాత రూ.లక్ష నుంచి రూ.లక్షన్నర లోపు రుణాలున్న 6 లక్షల 40 వేల 823 మంది రైతుల ఖాతాల్లోకి జులై 30న రూ.6190 కోట్లు జమ చేసింది. రూ.లక్షన్నర నుంచి రూ.2 లక్షల్లోపు రుణం కలిగిన రైతులకు ఇవాళ మాఫీ ప్రక్రియ పూర్తి చేసింది.
ఈ సందర్భంగా మాట్లాడిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రైతు డిక్లరేషన్‌లో భాగంగా తెలంగాణ రైతులకు రుణమాఫీ చేస్తామని రాహుల్ గాంధీ మాట ఇచ్చారని గుర్తు చేశారు. చెప్పిన మాట ప్రకారం అధికారంలోకి వచ్చిన 8 నెలల్లోనే రూ.2 లక్షల రుణమాఫీ చేశామని స్పష్టం చేశారు. ఎంత మంది అడ్డుపడినా, రైతు రుణమాఫీ చేస్తున్నామన్న సీఎం, రూ.18 వేల కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నామన్నారు. ఈ క్రమంలోనే పంద్రాగస్టులోపు రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తానని హరీశ్‌రావు సవాల్ విసిరారని, రుణమాఫీ అమలు చేసినందున తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలన్నారు. లేనిపక్షంలో అమరవీరుల స్థూపం వద్ద ముక్కు నేలకు రాసి, తెలంగాణ ప్రజలను క్షమాపణ కోరాలన్నారు.
తెలంగాణను ప్రపంచానికి ముఖద్వారంగా మారుద్దాం - మన బ్రాండ్ విశ్వవేదికపై ఉండాలి: సీఎం రేవంత్‌రెడ్డి - CM REVANTH FLAG HOISTING
రూ.2 లక్షల రుణమాఫీ చేస్తానని ఖమ్మం గడ్డ నుంచి మాటిచ్చా. ఎంత మంది అడ్డుపడినా రైతు రుణమాఫీ చేసి చూపించాం. రుణమాఫీ చేస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని హరీశ్‌రావు సవాల్ విసిరారు. రుణమాఫీ పూర్తైనందున హరీశ్ రాజీనామా చేయాలి. లేదంటే అమరుల స్థూపం వద్ద ముక్కు నేలకు రాసి, తెలంగాణ ప్రజలను క్షమాపణ కోరాలి. మాట తప్పని పార్టీ రుణమాఫీ చేసిందని క్షమాపణ చెప్పాలి. తాను విసిరిన సవాల్‌ను వెనక్కి తీసుకుంటున్నట్లు చెప్పాలి. - రేవంత్ రెడ్డి, ముఖ్యమంత్రి
ఖమ్మం జిల్లా రైతులకు అండగా నిలిచేందుకే ఈ ప్రాంతానికి వచ్చానని సీఎం పేర్కొన్నారు. రెండు పడక గదుల ఇళ్ల పేరిట పేదలను కేసీఆర్ మోసగించారని విమర్శించారు. ఈ ఏడాది నియోజకవర్గానికి 3500 చొప్పున ఇందిరమ్మ ఇళ్లు అందిస్తామన్న ఆయన, రాష్ట్రవ్యాప్తంగా 4.5 లక్షల ఇందిరమ్మ ఇళ్లు పేదలకు అందిస్తామని తెలిపారు. పేదలు ఆత్మ గౌరవంతో బతికేలా కార్యక్రమాలు చేపట్టామని, ఆరు గ్యారంటీల అమలుకు నిరంతరం కష్టపడుతున్నామని స్పష్టం చేశారు.
బీఆర్‌ఎస్‌ను బద్దలు కొడతాం - బీజేపీని బొందపెడతాం : 'అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్కు 39 సీట్లు ఇచ్చిన ప్రజలు, లోక్‌సభలో గుండు సున్నా ఇచ్చారు. వాళ్లను మనుషులుగా గుర్తిస్తే ఒక్క ఎంపీ సీటైనా ప్రజలు ఇచ్చేవారు. సోనియా గాంధీ ఇచ్చిన గ్యారెంటీలను నెరవేర్చే బాధ్యత నాది. మీరు అండగా నిలబడితే బీఆర్‌ఎస్‌ను బద్దలు కొడతాం. బీజేపీని బొందపెడతాం. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి 8 ఎంపీ సీట్లు ఇస్తే, బడ్జెట్‌లో గాడిద గుడ్డు ఇచ్చారంటూ' సీఎం ఆక్షేపించారు.
సీతారామ ప్రాజెక్టును ప్రారంభించిన సీఎం రేవంత్ - పరవళ్లు తొక్కిన గోదారమ్మ - SITARAMA PROJECT LAUNCHED