Chief Minister Chandrababu Naidu Announced Seven New Airports : రాష్ట్రంలో నూతనంగా మరో ఏడు విమానాశ్రయాలను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఈ కొత్త ఎయిర్‌పోర్టుల నిర్మాణం, వాటి అభివృద్ధిపై ఉండవల్లిలోని తన నివాసంలో కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌నాయుడు, అలాగే ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ అధికారులతో శుక్రవారం ముఖ్యమంత్రి సమీక్షించారు.
రాష్ట్రంలో కుప్పం, శ్రీకాకుళం, దగదర్తి, తాడేపల్లిగూడెం, తుని-అన్నవరం, నాగార్జునసాగర్, ఒంగోలులో కొత్త విమానాశ్రయాలను నిర్మించాలన్నది ప్రభుత్వ ఆలోచనని చంద్రబాబు తెలిపారు. ఇప్పటికే శ్రీకాకుళంలో విమానాశ్రయ నిర్మాణానికి ఫీజిబిలిటీ సర్వే పూర్తయిందన్నారు. రెండు దశల్లో 1383 ఎకరాల్లో దీన్ని నిర్మించనున్నట్లు చెప్పారు. ఇందుకు అవసరమైన భూమిని సైతం సేకరిస్తున్నామని వివరించారు. గత తెలుగుదేశం ప్రభుత్వంలోనే దగదర్తిలో విమానాశ్రయాన్ని 1,379 ఎకరాల్లో నిర్మించాలని నిర్ణయించి, అందుకు 635 ఎకరాలను సైతం సేకరించామని చెప్పారు. ఇక మిగిలిన భూసేకరణ పూర్తి చేసి పనులు ప్రారంభించాలన్నారు.
ప్రస్తుతం ఈ ప్రాంతంలో బీపీసీఎల్ చమురుశుద్ధి కార్మాగారాన్ని ఏర్పాటు చేస్తోందని సీఎం చంద్రబాబు చెప్పారు. అలాగే ఒంగోలులో విమానాశ్రయ ఏర్పాటుకు 657 ఎకరాలను ప్రభుత్వం గుర్తించిందన్నారు. ప్రస్తుతం దీనిపై అధ్యయనం చేయాల్సి ఉందన్నారు. పల్నాడు జిల్లా నాగార్జునసాగర్‌లో 1,670 ఎకరాల్లో, తాడేపల్లిగూడెంలో 1,123 ఎకరాల్లో విమానాశ్రయాలను నిర్మించాలని భావిస్తున్నాట్లు తెలిపారు. అదేవిధంగా తుని-అన్నవరం మధ్య విమానాశ్రయ ఏర్పాటుకు 757 ఎకరాలను గుర్తించామన్నారు. అనకాపల్లి జిల్లాలో కొత్త పరిశ్రమలు, నక్కపల్లిలో ఉక్కు కర్మాగారం వస్తున్నాయని తెలిపారు. శ్రీసిటీలో ఎయిర్‌స్ట్రిప్ ఏర్పాటు ప్రతిపాదనను పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు. వీటన్నింటితో పాటు ఏవియేషన్ విశ్వవిద్యాలయం, శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలనే ఆలోచన ఉందన్నారు. భవిష్యత్తులో ప్రైవేటు విమానాల పార్కింగ్ అవసరాలు పెరుగుతాయని దీనికి అనుగుణంగా నిర్మాణాలు చేపట్టాలని ముఖ్యమంత్రి అన్నారు.