Chenchu Woman Brutally Hurt in Nagarkurnool : నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ తాలూకా మొలచింతలపల్లిలో ఆదివాసీ కుటుంబంపై పాశవిక దాడిపై మంత్రి జూపల్లి కృష్ణారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దాడికి పాల్పడిన నిందితులు ఎంతటివారైనా వదిలిపెట్టమని హెచ్చరించారు. నాగర్ కర్నూల్ జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధిత మహిళను ఆయన పరామర్శించారు. ఆమెకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించారు. బాధితురాలిని, ఆమె భర్తను జరిగిన ఘటనపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆమెకు ప్రభుత్వం అన్ని రకాలుగా సహకారం అందిస్తుందని భరోసా ఇచ్చారు.
ఈ సందర్భంగా మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ నిందితులను చట్టపరంగా శిక్షిస్తామని హామీ ఇచ్చారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటామన్నారు. ఇలాంటి పాశవిక చర్యలు జరగడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. బాధిత కుటుంబానికి రూ.2 లక్షల ఆర్థిక సాయంతో పాటు ప్రభుత్వపరంగా వ్యవసాయం చేసుకోవడానికి కొంత భూమిని అందిస్తామని హామీ ఇచ్చారు. బాధిత పిల్లలకు ప్రభుత్వపరంగా విద్యను అందించే విధంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
"చెంచు మహిళపై దాష్టీకమైన దాడి జరిగింది. నిందితులను చట్టప్రకారం శిక్షిస్తాం. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా అన్ని చర్యలు తీసుకుంటాం. ఇలాంటివి జరగడం బాధాకరం. బాధిత కుటుంబాన్ని అన్ని రకాలుగా ఆదుకుంటాం. బాధిత కుటుంబానికి రూ.2 లక్షల ఆర్థిక సాయం అందిస్తాం. ప్రభుత్వపరంగా అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తాం."- జూపల్లి కృష్ణారావు, మంత్రి
అసలేం జరిగిందంటే :నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం మొలచింతలపల్లి గ్రామానికి చెందిన చెంచు మహిళ ఈశ్వరమ్మ-ఈదన్న దంపతులు. కొల్లాపూర్‌లోని ఓ వ్యక్తి వద్ద రూ.30 వేలు తీసుకుని కూలీ పనికి కుదిరారు. వారు పని సక్రమంగా చేయడం లేదంటూ ఆ యజమాని ఇబ్బందులు పెట్టేవాడు. అతని బాధను తట్టుకోలేని దంపతులు తమ సొంత భూమిని కౌలుకు తీసుకున్న బండి వెంకటేశ్ అనే వ్యక్తి వద్ద నుంచి రూ.30 వేలను తీసుకొని కొల్లాపూర్‌కు చెందిన వ్యక్తికి చెల్లించారు.
ఈ క్రమంలో ఈశ్వరమ్మ, ఈదన్నలను వారి సొంత పొలంలోనే వెంకటేశ్ వారిని కూలీ పనికి పెట్టుకున్నాడు. వారికి కూలీ డబ్బులు చెల్లించకుండానే వెట్టిచాకిరి చేయించుకునేవాడు. చేయకపోతే ఇబ్బందులు పెట్టేవాళ్లు. వారు అక్రమంగా నడిపే ఇసుక ఫిల్టర్ కేంద్రంలో పనికి పంపేవాడు. ఆమెతో గంటలోనే ట్రాక్టర్ లోడ్ ఇసుకను నింపాలని ఆదేశించేవాడు. ఒకవేళ అలా చేయకపోతే దుర్భాషలాడుతూ భౌతిక దాడులకు పాల్పడేవాడు. వాటిని తట్టుకోలేని బాధిత మహిళ తన భర్తతో గొడవపడి పుట్టింటికి చుక్కాయిపల్లికి వెళ్లిపోయింది.