BC Declaration in Jayaho BC Sabha : బీసీ డిక్లరేషన్ గురించి ప్రతి ఇంటికీ వెళ్లి వివరించాలని తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు పేర్కొన్నారు. వందల సమావేశాలు పెట్టి, నేతల అభిప్రాయాలు తీసుకుని బీసీ డిక్లరేషన్ ప్రకటించినట్లు తెలిపారు. బీసీలకు టీడీపీ 40 ఏళ్లుగా అండగా ఉంటుందని పేర్కొన్నారు. బీసీల డీఎన్‌ఏలోనే తెలుగుదేశం పార్టీ ఉందని తెలిపారు. బీసీలకు 50 ఏళ్లకే పింఛన్లు ఇస్తామని, రాబోయే రోజుల్లో పింఛను రూ.4 వేలు చేస్తామని హామీ ఇచ్చారు. బీసీల రుణం తీర్చుకునేందుకే పది సూత్రాలతో బీసీ డిక్లరేషన్ తీసుకువచ్చినట్లు తెలిపారు. బీసీ సబ్‌ప్లాన్ ద్వారా ఐదేళ్లలో రూ.లక్షా 50 వేల కోట్లు కేటాయిస్తామని చంద్రబాబు తెలిపారు. అయితే, వైఎస్సార్సీపీ పాలనలో సబ్‌ప్లాన్ నిధులను పక్కదారి పట్టించారని ఆరోపించారు.
నాపై ఉన్న కేసుల వివరాలివ్వండి - ఏపీ డీజీపీకి చంద్రబాబు లేఖ
బీసీలకు జనాభా దామాషా ప్రకారం అవకాశాలు : జగన్ వచ్చాక స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్ తగ్గించారని చంద్రబాబు ఆరోపించారు. రిజర్వేషన్ తగ్గించడం వల్ల 16,800 మంది బీసీలు పదవులు కోల్పోయారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. చట్టబద్ధంగా బీసీల కులగణన చేపట్టాలని డిమాండ్ చేశారు. బీసీల ఆర్థిక పరిస్థితులు అధ్యయనం చేయాలని, బీసీలకు జనాభా దామాషా ప్రకారం అవకాశాలు కల్పిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు.
బీసీల కోసం ప్రత్యేక రక్షణ చట్టం తెస్తాం. బీసీల జోలికి ఎవరైనా వస్తే జాగ్రత్త. పరిశ్రమలు పెట్టేలా బీసీ వర్గాలను ప్రోత్సహిస్తాం. బీసీలకు షరతులు లేకుండా విదేశీ విద్య పథకం అమలు చేస్తాం. చంద్రన్న బీమా కింద బీసీలకు రూ.10 లక్షలు ఇస్తాం. లంచాలు లేకుండా బీసీలకు ధ్రువపత్రాలు ఇచ్చేలా చూస్తాం. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోగా బీసీ భవనాలు, కమ్యూనిటీ హాళ్లు పూర్తి చేస్తాం - చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు