CFD on Officers and Volunteers: అధికారులు నిష్పక్షపాత వైఖరి కోల్పోయి, ఒక రాజకీయ పార్టీకి అండదండగా పనిచేస్తున్నారో వారంతా చింతించే రోజు తప్పకుండా వస్తుందని సిటిజన్ ఫర్ డెమోక్రసీ (Citizens for Democracy) సంస్థ ఉపాధ్యక్షుడు, మాజీ సీఎస్ ఎల్.వి.సుబ్రమణ్యం అన్నారు. ప్రవర్తన లోపాలతో మచ్చలేని రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగాన్ని అబాసుపాలు చేయొద్దని హితవు పలికారు.
వ్యవస్థాగతంగా అనేక విమర్శలు వచ్చిన తరుణంలోనే కేంద్ర ఎన్నికల సంఘం వాలంటీర్ల వ్యవస్థ పనికిరాదని, వినియోగించకూడదని, ఆక్షేపించిన తర్వాత ప్రత్యామ్నాయానికి ఇంత సమయం తీసుకోరాదని తెలిపారు. తమ బాధ్యతను విస్మరించి ఇతరులపై నింద వేయడం సరికాదని అన్నారు. ఎన్నికలు అనేవి వేగవంతంగా వస్తోన్న నిజమని, కానీ అధికార యంత్రాంగం ఇందుకు తగిన సమాయత్తంతో ఉన్నట్లు కనిపించడం లేదని విమర్శించారు. వాలంటీర్లు తమ పదవికి రాజీనామాలు చేసి ఎన్నికల్లో పోలింగ్ ఏజెంట్లుగా పనిచేయడం సమర్ధనీయం కాదని సీఎఫ్‌డీ కార్యదర్శి నిమ్మగడ్డ రమేష్‌కుమార్ అన్నారు.
LV Subramanyam Comments: రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం ఎన్నికల ప్రవర్తనా నియమావళిని గౌరవించి, ఆదరించి, ఆచరించి పోటీ చేసే అభ్యర్ధులందరికీ నమ్మకాన్ని కలిగించాల్సిన తరుణం వచ్చిందని సెటిజన్ ఫర్ డెమోక్రసీ ప్రతినిధులు పేర్కొన్నారు. పోటీలో నిలిచే ప్రతి అభ్యర్ధి తనకు గెలుపు అవకాశం రావాలని ఆశిస్తుంటారని, ఈ సమయంలో అధికార యంత్రాంగం పనితీరు, వారి ప్రవర్తన ఎన్నికలపై ప్రభావం చూపుతుందని అన్నారు. ఎన్నికల వేళ జిల్లా కలెక్టరు నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వరకు, ఎస్పీ మొదలు డీజీపీ వరకు అంతా నిష్పక్షపాత వైఖరిని చూపించాలని అంతా ఆశిస్తారని ఎల్.వి.సుబ్రమణ్యం అన్నారు.
రాష్ట్రంలో వాలంటీరు వ్యవస్థ గురించి వచ్చిన అనేక విమర్శలను పరిగణనలోకి తీసుకునే తమ సంస్థ కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. ఈ వ్యవస్థను వినియోగించరాదని ఈసీ ఆదేశించిన తర్వాత ప్రత్యామ్యానికి ఇంత సమయం తీసుకోరాదని అన్నారు. ఎప్పటికప్పుడు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి తాము లేఖలు రాస్తున్నామని, వాటిని పరిశీలించి జిల్లా యంత్రాంగానికి తగిన ఆదేశాలు జారీ చేయడంలో ఆలోచనలు, సమాలోచనలకు ఎక్కువ సమయం మంచిది కాదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.