Central Team To Assess Flood Damage :కళ్లెదుటే తమ కష్టం కొట్టుకుపోయిందని వరద బాధితులు కేంద్ర బృందానికి మొరపెట్టుకున్నారు. కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి అనిల్ సుబ్రమణియం నేతృత్వంలోని కేంద్ర బృందం కృష్ణ జిల్లా పెనమలూరు, పామర్రు, గుడివాడ నియోజకవర్గాల్లో పర్యటించింది. పెదపులిపాకలో దెబ్బతిన్న మొక్కజొన్న పంటలు, వరదలకు నీట మునిగిన ఇళ్లను పరిశీలించింది.
పెనమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్ యనమలకుదురు, పెదపులిపాక, మద్దురు, ఉప్పులూరు గ్రామాల్లో జరిగిన పంట, ఆస్తి నష్టం వివరాలను అధికారులకు అందించారు. చోడవరంలో బొప్పాయి, అరటి కంద వంటి దెబ్బతిన్న పంటల్ని పరిశీలించారు. సాగు మొదలు పెట్టిన 2 నెలలకే పంటలన్నీ కొట్టుకుపోయాయని పెనమలూరు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. బాధితులకు రైతు రుణాలను మాఫీ చేయాలని, మళ్లీ సాగు చేసుకునేందుకు ఎరువులు, విత్తనాలు అందిచాలని రైతు సంఘాల నేతలు కేంద్ర బృందాన్నికోరారు. కృష్ణా జిల్లా కలెక్టర్ బాలాజీ వరద నష్టం వివరాలను అధికారులకు వివరించారు.
రాష్ట్రంలో భారీగా వరద నష్టం- అంచనాలపై కేంద్ర బృందం పర్యటన - Central Team To Assess Flood Damage
పామర్రు ఎమ్మెల్యే కుమార్‌రాజ రొయ్యూరులో కేంద్రబృందాన్ని కలిసి వాడిపోయిన పంటలను చూపించారు. గుడివాడ నియోజకవర్గం పుట్టగుంట వద్ద నీట మునిగిన బుడమేరు బ్రిడ్జి, చేపల చెరువులను కేంద్ర బృందం పరిశీలించించింది. గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము బుడమేరు విధ్వంసం గురించి వివరించారు.