Central Survey On Consumption Of Cooking Oils : రుచికరమైన ఆహార పదార్థాలు తయారు కావాలంటే తగినంత వంట నూనె ఉపయోగించాల్సిందే. మనం ఇంట్లో మిర్చిబజ్జీలు, సమోస, పూరి కోసం వంట నూనె పదే పదే వేడి చేసి ఉపయోగిస్తాము. అదే నూనెను తిరిగి ఇతర ఆహార పదార్థాలు వండటానికి వినియోగించడం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయని వైద్యులు చెబుతున్నారు. అయితే కేంద్రం వంటనూనెల వినియోగంపై సర్వే చేపట్టింది. భారత అర్ధ, గణాంకశాఖ వెబ్‌సైట్‌లో ఈ సర్వేకు సంబంధించిన 24 ప్రశ్నలను ఉంచింది.
వాడిన వంటనూనె మళ్లీ వాడుతున్నారా : ఇంట్లో నిత్యం వేపుళ్లకు వాడిన వంటనూనె మళ్లీ వాడుతున్నారా? వంటనూనెలు అధికంగా వాడితే ఆరోగ్య సమస్యలొస్తాయని మీకు తెలుసా? బాగా వేయించిన ఆహారం తరచూ తింటారా? అని కేంద్రం ప్రజలకు ప్రశ్నలు వేస్తోంది. దేశంలో వంటనూనెల వినియోగం పెరుగుతుండటం, దేశీయంగా నూనెల కొరత నేపథ్యంలో తొలిసారి ప్రజల నుంచి వీటిపై సమగ్ర సమాచార సేకరణకు ప్రత్యేకంగా సర్వే చేపట్టింది.
ఆన్‌లైన్‌లో మీ అభిప్రాయాలు : భారత అర్ధ, గణాంకశాఖ వెబ్‌సైట్‌లో ఈ సర్వేకు సంబంధించిన 24 ప్రశ్నలను ఉంచింది. ఆన్‌లైన్‌లో మీ అభిప్రాయాలు చెప్పడానికి ఈ నెల 23 వరకూ గడువు ఇచ్చింది. కొన్ని ప్రశ్నలకు అవును, కాదు అని కొన్నింటికి నిర్దిష్ట సమాధానాలను ప్రశ్న కిందనే ఉంచింది. వాటిలో మీ అభిప్రాయాలను ఎంపిక చేసి ఆన్‌లైన్‌లో నమోదు చేస్తే మీ నుంచి సమాచారం ప్రభుత్వానికి లభిస్తుంది.