Rajnath Singh to Lay Foundation Stone For Radar Station : వికారాబాద్ జిల్లా పూడూరు మండలంలోని దామగుండం అటవీ ప్రాంతంలో భారత నావికాదళం నిర్మించనున్న వీఎల్ఎఫ్ రాడార్ స్టేషన్ నిర్మాణానికి ముహూర్తం ఖరారైంది. ఈ నెల 15న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ రాడార్ స్టేషన్ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. ఈ నేపథ్యంలో నేవీ అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. గత 14 ఏళ్లుగా ఈ రాడార్ స్టేషన్ నిర్మాణానికి నావికాదళం ప్రయత్నాలు చేస్తోంది. 2010 నుంచి 2023 వరకు అప్పటి రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదింపులు జరుపుతూనే ఉంది.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఈ విషయంపై రేవంత్ రెడ్డి దృష్టి సారించారు. ఆయన సమక్షంలోనే ఈ ఏడాది జనవరి 24న రిజర్వు ఫారెస్ట్‌లోని 2,900 ఎకరాలను అటవీ అధికారులు నావికా దళానికి అప్పగించారు. దీంతో రాడార్ స్టేషన్‌కు అవసరమైన భూములు అందుబాటులోకి రావడంతో ఈ నెల 15న శంకుస్థాపనకు ముహూర్తం ఖరారు చేశారు. హైదరాబాద్‌కు 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న దామగుండంలోని అటవీ ప్రాంతం మొత్తం 3 వేల 260 ఎకరాల్లో విస్తరించి ఉంది. పూడూరు గ్రామం మీదుగా వెళ్తే ఈ అటవీ పరిధిలోకి వెళ్లొచ్చు. అక్కడ పురాతన కాలం నాటి రామలింగేశ్వర స్వామి దేవాలయం ఉంది.
రాడార్ స్టేషన్‌ను నిర్మించనున్న ఈస్టర్న్ నావల్ కమాండ్ : నగరం నుంచి చాలా మంది భక్తులు ఇక్కడికి వచ్చిపోతుంటారు. ఈ ప్రాంతంలో చాలా వరకు సినిమా షూటింగ్స్ కూడా జరుపుకున్నాయి. ఈ అడవిని ఆనుకొని సుమారు 20 వరకు చిన్న పల్లెలు, తండాలున్నాయి. పశువుల మేత, ఇతరత్రా అవసరాలకు స్థానిక ప్రజలు ఈ అడవిపై ఆధారపడుతుంటారు. అడవి మధ్యలో చిన్న చిన్న నీటివనరులు, వాగులు వంకలున్నాయి. ఎంతో అహ్లాదకరంగా ఉండే ఈ అటవీ ప్రాంతంలో జీవవైవిధ్యం కళ్లకు కట్టినట్లు కనిపిస్తుంది. పెద్ద జంతువులేవీ లేకపోయినా రకరకాల పక్షులు, జింకలు, దుప్పులు కనిపిస్తాయి. ఇక్కడ అనేక ఔషధ మొక్కలు ఉండటంతో చాలా మంది శాస్త్రవేత్తలు ఈ ప్రాంతంలో నిత్యం అన్వేషణ సాగిస్తుంటారు.
అలాంటి ఈ అటవీ ప్రాంతంలోని భూముల్లో 2900 ఎకరాలను నేవీకి అప్పగించారు. ఆ భూముల్లో లక్షా 93 వేల చెట్లున్నట్లు గుర్తించారు. మరో 300 నుంచి 400 ఎకరాల్లో గడ్డి భూములున్నాయి. నేవీకి అప్పగించిన భూముల్లోని చెట్లను పూర్తిగా తొలగించబోమని అధికారులు చెబుతున్నారు. అవసరమైతే తొలగించాల్సిన చెట్లను వేళ్లతో సహా పెకిలించి గడ్డిభూముల్లో నాటాలని అటవీ శాఖ అధికారులు ఆలోచిస్తున్నారు. విశాఖపట్నం కేంద్రంగా పనిచేస్తున్న ఈస్టర్న్ నావల్ కమాండ్ దామగుండంలో వీఎల్ఎఫ్ రాడార్ స్టేషన్‌ను నిర్మించబోతుంది. వీఎల్ఎఫ్ అంటే వెరీలో ఫ్రీక్వెన్సీ రాడార్ అంటారు. ఈ రాడార్ వ్యవస్థ ద్వారా సముద్రంలో ఉన్న ఓడలు, జలాంతర్గాముల్లోని సిబ్బందితో సమాచారాన్ని పంచుకోవచ్చు.