CM Revanth Request Smart Cities Mission Extend :రాష్ట్రానికికేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. స్మార్ట్ సిటీస్ మిషన్‌ను 2025 మార్చి వరకు పొడిగించేందుకు కేంద్రం అంగీకరించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వినతిపై సానుకూలంగా స్పందించిన కేంద్రం, స్మార్ట్ సిటీస్ మిషన్ పనుల గడువును పొడిగించింది. దిల్లీ పర్యటనలో భాగంగా ఈ నెల 24న సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్‌ను కలిసి స్మార్ట్ సిటీస్ మిషన్ కాల పరిమితిని వచ్చే ఏడాది జూన్ వరకు పొడిగించాలని కోరారు. దీనికి సానుకూలంగా స్పందించిన కేంద్రం, మరో ఏడాది పాటు స్మార్ట్ సిటీస్ మిషన్‌ను పొడిగించింది.
కేంద్ర ప్రభుత్వం గత ఒప్పందం ప్రకారం స్మార్ట్ సిటీస్ మిషన్ కాల పరిమితి ఈ నెలాఖరుతో ముగియనుంది. రాష్ట్రంలో వరంగల్, కరీంనగర్ నగరాల్లో స్మార్ట్ సిటీస్ మిషన్ పనులు కొనసాగుతున్నాయి. వరంగల్‌లో ఇప్పటివరకు 45 పనులు పూర్తి కాగా, రూ.518 కోట్లతో మరో 66 పనులు కొనసాగుతున్నాయి. కరీంనగర్లో 25 పనులు పూర్తి కాగా, మరో రూ.287 కోట్లకు సంబంధించిన 22 పనులు కొనసాగుతున్నాయి. స్మార్ట్ సిటీ మిషన్ పనులు పూర్తి కానందున ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఈ పనులు పూర్తయ్యే వరకు మిషన్ గడువు పొడిగించాలని కేంద్ర ప్రభుత్వాన్ని సీఎం కోరారు.
సీఎం విజ్ఞప్తికి స్పందించిన కేంద్రం స్మార్ట్ సిటీ మిషన్‌ను 2025 మార్చి 31 వరకు పొడిగిస్తూ రాష్ట్రాలకు లేఖ రాసింది. ఇప్పటికే నిధులు కేటాయించి ఆమోదించిన పనులను కొనసాగించాలని, కొత్త పనుల మంజూరు ఉండదని ఈ లేఖలో స్పష్టం చేసింది. జరుగుతున్న పనులకు సంబంధించిన నిధులను ఈ ఏడాది సెప్టెంబరు వరకు ఫస్ట్ కమ్ ఫస్ట్ పద్ధతిన విడుదల చేస్తామని కేంద్రం తెలిపింది. వీలైనంత త్వరగా ఈ పనులను పూర్తి చేయాలని సూచించింది.