New Residential Vidyalayas in Telangana : తెలంగాణలో 7 జవహర్ నవోదయ విద్యాలయాల ఏర్పాటుకు కేంద్రం ఆమోదం తెలిపింది. దీనిపై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. మోదీ అధ్యక్షతన దిల్లీలో శుక్రవారం జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నారు. ఈ నిర్ణయం పట్ల యావత్ తెలంగాణ ప్రజలతో పాటుగా, వ్యక్తిగతంగా తనకు చాలా సంతోషంగా ఉందని అన్నారు. రాష్ట్రంలో నూతన జవహర్ నవోదయ విద్యాలయాలను ఏర్పాటు చేయాలని కోరుతూ గతంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను పలుమార్లు విజ్ఞప్తి చేసినట్లు ఆయన గుర్తు చేశారు.
దాదాపు రూ.340 కోట్లతో ఈ విద్యాలయాలను ఏర్పాటు చేయనున్నారు. దీంతో 4000 విద్యార్థులు ఇందులో చదువుకోవచ్చని కిషన్ రెడ్డి అన్నారు. అలాగే 6 నుంచి 12వ తరగతి వరకు హాస్టల్ వసతితో సహా అత్యున్నతమైన ప్రమాణాలతో కూడిన విద్యను అందించనున్నట్లు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. మరోవైపు 330 మందికి కొత్తగా ఉపాధి లభించనుందన్నారు.
కేబినెట్ మీటింగ్ : శుక్రవారం జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ దేశవ్యాప్తంగా ఏడు రాష్ట్రాల్లో 28 నవోదయ విద్యాలయాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అందులో 7 నవోదయాలను తెలంగాణకు కేటాయించింది. ఈ 28 విద్యాలయాల ఏర్పాటుకు 2024-29 మధ్యకాలంలో సుమారు రూ.2,359 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేసింది.