CCSACP Umamaheswara Rao Remand for 14 Days : ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో హైదరాబాద్ సీసీఎస్ ఏసీపీ టీఎస్ ఉమామహేశ్వరరావుకు న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది. ఈ మేరకు ఆయనను పోలీసులు చంచల్‌గూడకు తరలించారు. మంగళవారం తెల్లవారుజాము నుంచి ఏకకాలంలో 14 చోట్ల ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. రూ.3 కోట్లకు పైగా ఆస్తులను గుర్తించారు. ఉమామహేశ్వరరావు నివాసంలో రూ.38 లక్షల నగదు, 60 తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ఎలక్ట్రానిక్ ఉపకరణాలు, డైరీల్లో సందీప్ అనే పేరును గుర్తించారు. ఇద్దరు కలిసి ఏమైనా ఆర్థిక లావాదేవీలు సాగించారా అనే కోణంలో వివరాలు సేకరిస్తున్నారు.
హైదరాబాద్ శివార్లతో సహా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ 17 ప్రాంతాల్లో స్థిరాస్తులను అధికారులు గుర్తించారు. ఉమామహేశ్వరరావు అరెస్టు చేశారు. మధ్యాహ్నం తర్వాత ఆయనను నాంపల్లి ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు. ఈ మేరకు ఉమామహేశ్వరరావును చంచల్‌గూడ జైలుకు తరలించారు.
రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు :అశోక్ నగర్లో 205, 504 ఫ్లాట్స్‌లో సోదాలు నిర్వహించామని రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. బర్కత్‌పురాలో డీఎస్పీ సందీప్ రెడ్డి నివాసంలో కూడా సోదాలు జరిపారు. మరోవైపు కాప్రాలోని స్నేహితుడు నరేంద్ర బాబు నివాసంలో దాడులు చేశారు. సికింద్రాబాద్‌లో నీలిమా నివాసం, అనకాపల్లిలో బంధువు మహాలక్ష్మి, విశాఖపట్టణంలోని బంధువుల ఇళ్లల్లోనూ సోదాలు చేశారు. ఈ సోదాల్లో నగదు రూ.38 లక్షలు, బంగారం 60 తులాలు స్వాధీనం చేసుకున్నారు.