Call Letter for Last Test of a Job to Died Young Man in Mancherial: ప్రతి వ్యక్తి జీవితంలో ఒక విషాధ గాథ దాగి ఉంటుంది. ఒకప్పుడు ఉద్యోగం కోసం ఓ యువకుడు తీవ్రంగా కృషి చేశాడు. ఎన్ని ప్రయత్నాలు చేసినా జాబ్ రాకపోవడంతో మానసికంగా కుంగిపోయి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే తాను బతికి ఉన్నప్పుడు అప్లై చేసిన ఓ ఉద్యోగానికి, నాలుగేళ్ల తర్వాత చివరి పరీక్షకు హాజరుకావాలని కాల్ లెటర్ వచ్చింది. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు విషాదంలో మునిగిపోయారు. ఈ ఘటన మంచిర్యాల జిల్లాలో జరిగింది.
కుటుంబసభ్యులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం తెలంగాణ రాష్ట్రంలోని మంచిర్యాల జిల్లాలోని మందమర్రి గ్రామానికి చెందిన సిద్దెంకి మొండయ్య, సరోజ దంపతులకు నవీన్ కుమార్, అనూష, ఆదిత్య, జీవన కుమార్ సంతానం. వారిలో ఇద్దరు కుమార్తెలు మానసిక దివ్యాంగులు. వారిలో ఒకరైన జీవన్ కుమార్ (24) 2014లో ఐటీఐ పూర్తి చేశారు. 2018లో నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ లిమిటెడ్లో జూనియర్ లైన్మెన్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ కాగా, ఆ యువకుడు అప్లై చేసుకున్నాడు. పరీక్ష రాసి ఫలితాల కోసం ఎదురుచూశాడు. అనారోగ్యంతో అక్క ఆదిత్య (2018లో), తల్లి సరోజ (జనవరి, 2019లో) మరణించారు. ఎంత ఎదురు చూసినా ఉద్యోగం రాకపోవడం, కుటుంబ సమస్యలు పెరగడంతో జీవన్ కుమార్ 2020 మార్చి 15న ఆత్మహత్య చేసుకున్నాడు. అనంతరం అక్క అనూష, తండ్రి మొండయ్య చనిపోయారు. ప్రస్తుతం పెద్ద కుమారుడు నవీన్ ఒక్కరే ఉన్నారు.