9 Hours Free Power to Agriculture: వ్యవసాయానికి 9 గంటల ఉచిత విద్యుత్ సరఫరాకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఏపీ విద్యుత్ పంపిణీ సంస్థ స్పష్టం చేసింది. రాష్ట్రంలో ఎక్కడా వ్యవసాయానికి 9 గంటల ఉచిత విద్యుత్ సరఫరాలో ఎలాంటి మార్పులు లేవని తెలిపింది. సీపీడీసీఎల్ పరిధిలో 7 గంటలు మాత్రమే వ్యవసాయానికి ఉచిత విద్యుత్ అంటూ జరుగుతున్న ప్రచారంలో వాస్తవం కాదని తెలిపింది.
రైతులకు 9 గంటల విద్యుత్‌ను కుదించటం గానీ తగ్గించటం గానీ జరగలేదని అధికారులు స్పష్టం చేశారు. గత రెండు రోజులుగా పొగ మంచు కారణంగా సౌర విద్యుత్ ఉత్పత్తిపై ప్రభావం కారణంగా వ్యవసాయానికి విద్యుత్ సరఫరా సమయం రీషెడ్యూల్ మాత్రమే అయ్యిందన్నారు. రాష్ట్రంలో నిరంతరాయంగా వ్యవసాయానికి 9 గంటల పాటు విద్యుత్ సరఫరా జరుగుతోందని ఏపీ విద్యుత్ పంపిణీ సంస్థలు స్పష్టం చేశాయి.
వైఎస్సార్సీపీకి ఇంకా బుద్ది రాలేదు: రాష్ట్రంలో వ్యవసాయానికి 9 గంటల ఉచిత విద్యుత్ సరఫరాపై వైఎస్సార్సీపీ దుష్ప్రచారం చేస్తోందని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. 11 సీట్లకు వైఎస్సార్సీపీని ప్రజలు పరిమితం చేసినా వారి బుద్ధి మారలేదన్నారు. వ్యవసాయ మోటార్లకు స్మార్ట్ మీటర్లు బిగిస్తున్నామని చేసిన విష ప్రచారం బెడిసి కొట్టిందన్నారు. ఇప్పుడు 9 గంటల ఉచిత విద్యుత్ ఎత్తివేస్తున్నామని మరో అసత్య ప్రచారానికి వైఎస్సార్సీపీ నేతలు తెరలేపారని ఆరోపించారు.
వ్యవసాయానికి 9 గంటల ఉచిత విద్యుత్ ఇవ్వడానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని రవికుమార్ స్పష్టం చేశారు. 9 గంటల ఉచిత విద్యుత్ ఇవ్వడంలో ఎలాంటి మార్పులు లేవని తెలిపారు. ఉచిత విద్యుత్ విషయంలో వైఎస్సార్సీపీకి చెందిన మీడియా ప్రజలను తప్పుదోవ పట్టించాలని ప్రయత్నిస్తోందన్నారు. అసత్య వార్తల ద్వారా ప్రజలను తప్పుదోవ పట్టించే వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. జగన్ విధ్వంస పాలనకు, చంద్రబాబు సంక్షేమ పాలనకు మధ్య చాలా తేడా ఉందని రవికుమార్ అన్నారు.