High Court About Tirupati Stampede Issue : తిరుపతిలో శ్రీవారి వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల కేంద్రం వద్ద చోటు చేసుకున్న తొక్కిసలాట ఘటనతో గవర్నర్, ముఖ్యమంత్రికి ఏం సంబంధమని పిటిషనర్‌ను హైకోర్టు ప్రశ్నించింది. పిల్‌లో వారిని ప్రతివాదులుగా చేర్చడంపై అభ్యంతరం తెలిపింది. ప్రభుత్వం తరఫున ప్రధాన కార్యదర్శి, ఇతర అధికారులు ప్రతివాదులుగా ఉన్నారు కదా అని గుర్తు చేసింది.
హైకోర్టు రిజిస్ట్రీ లేవనెత్తిన అభ్యంతరాలకు కట్టుబడి సీఎం, గవర్నర్ కార్యదర్శులను ప్రతివాదుల జాబితా నుంచి తొలగించాలని పిటిషనర్‌కు తేల్చి చెప్పింది. పిల్‌పై విచారణను బుధవారానికి వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ కె. సురేష్‌రెడ్డి, జస్టిస్ కుంచం మహేశ్వరరావుతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఈ మేరకు ఉత్తర్వులిచ్చింది.
తిరుపతిలో చోటు చేసుకున్న తొక్కిసలాట, భక్తుల మృతి వ్యవహారంపై హైకోర్టు సిటింగ్ లేదా హైకోర్టు విశ్రాంత జడ్జితో జ్యుడిషియల్ విచారణ జరిపించాలని కోరుతూ కర్నూలు జిల్లాకు చెందిన రైతు జి. ప్రభాకరరెడ్డి పిల్ వేసిన విషయం తెలిసిందే. దానికి నంబరు కేటాయించేందుకు హైకోర్టు రిజిస్ట్రీ నిరాకరించింది. సీఎం, గవర్నర్ కార్యదర్శిని ప్రతివాదులుగా చేర్చడంపై అభ్యంతరం తెలిపింది. పిల్‌కు నంబరు కేటాయించే అంశంపై శుక్రవారం హైకోర్టు ధర్మాసనం విచారణ జరిపింది. రిజిస్ట్రీ నిర్ణయాన్ని సమర్థించింది.
తిరుపతి ఘటన - ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 వరకూ ఏం జరిగిందంటే?
తిరుమల శ్రీవారిని వైకుంఠ ఏకాదశి రోజు దర్శించుకోవాలని టోకెన్లు తీసుకునేలోపే వారు మృత్యుఒడిలోకి వెళ్లిపోయారు. గతంలో ఎన్నడూ లేని చోటు చేసుకున్న తొక్కిసలాటలో ఆరుగురు భక్తులు ప్రాణాలు కోల్పోయారు. జనవరి 8వ తేదీ ఉదయం 10 గంటలకు వచ్చిన భక్తులు రాత్రి 10 వరకూ నిరీక్షించారు.
అక్కడైతే భక్తుల తాకిడి తక్కువగా ఉంటుందని: బైరాగిపట్టెడలోని రామానాయుడు స్కూల్ వద్ద భక్తుల తాకిడి తక్కువగా ఉంటుందని భావించిన యాత్రికులు జనవరి 8వ తేదీ ఉదయం 10 గంటలకే అక్కడకు చేరుకున్నారు. దీంతో రాత్రికి పరిసర ప్రాంతాలన్నీ కిక్కిరిసిపోవడంతో పక్కనే ఉన్న శ్రీపద్మావతి పార్కులోకి భక్తులను కూర్చోబెట్టారు. అక్కడ నుంచి రాత్రి 8.20 గంటలకు క్యూలైన్లలోకి అనుమతించారు. ఈ సమయంలో పలువురు భక్తులు తోపులాటలో కిందపడిపోయారు. వెంటనే భక్తులను క్యూలైన్లలోకి అనుమతించకుండా నిలిపివేసిన అధికారులు సహాయ కార్యక్రమాలు చేపట్టారు. గాయపడిన వారిని హుటాహుటిన ఆస్పత్రులకు తరలించారు.
గురువారం తిరుమలకు సీఎం చంద్రబాబు - ఆస్పత్రిలో బాధితులకు పరామర్శ