Astrology Tips for Success in Work : జీవితంలో మనం అనుకున్న పనులన్నీ అనుకున్నట్లుగా జరగవు. కొన్నిసార్లు 100 శాతం పూర్తవుతుందని అనుకున్న పని ఏదోక ఆటంకం కలగడం వల్ల మధ్యలోనే ఆగిపోతుంది. ఉదాహరణకు పోటీ పరీక్షలు బాగా రాసి లేదా ఉద్యోగ ఇంటర్య్వూ బాగా పూర్తి చేసి ఉద్యోగం వస్తుందని ఆశతో ఎదురుచూసే నిరుద్యోగికి నిరాశ కలగడం. అలాగే అమ్మాయి లేదా అబ్బాయికి పెళ్లి నిశ్ఛయమవుతుందనుకునే సమయంలో ఏదోక కారణంతో సంబంధం కుదరకపోవడం. ఇలా నిత్యం అనేక రకాల ఇబ్బందులను మనం ఎదుర్కొంటుంటాం. అయితే, ఇలా అనుకున్న పనులు జరగకపోవడం వెనుక జాతకంలో కొన్ని దోషాలు ఉండడం కారణం కావచ్చు! ఇలాంటి సమయంలో మన పని ఆటంకం కలగకుండా విజయవంతమవడానికి కొన్ని పరిహారాలు పాటించాలని ప్రముఖ జ్యోతిష్యుడు మాచిరాజు కిరణ్ కుమార్ చెబుతున్నారు. ఆ వివరాలు మీ కోసం.
ఆవ నూనెతో దీపం :
మనం అనుకున్న పని కష్టంగా ఉండి ఈజీగా పూర్తి కావాలంటే బయటకు వెళ్లేటప్పుడు ఒక చిన్న పరిహారం చేయాలి. ముందుగా గుమ్మం బయట ఆవ నూనెతో దీపం వెలిగించాలి. వెలుగుతున్న దీపంలో ఒక లవంగం వేసి ఇంట్లో నుంచి బయటకు వెళ్లండి. ఈ పరిహారం ద్వారా ఎంత కష్టమైన పని అయినా సులభంగా పూర్తవుతుంది. ఈ దీపం వెలిగించడం వల్ల శని, శుక్ర గ్రహాలు అనుకూలంగా మారతాయి. ఎందుకంటే ఆవ నూనె శని దేవుడికి ఇష్టం. అలాగే శుక్రుడికి ప్రీతికరం.
అర్ఘ్యం ఇవ్వండి :
రోజూ సూర్యోదయానికంటే ముందుగానే నిద్రలేచి స్నానం చేయండి. ఆపై తులసి కోట దగ్గర ధూపం వేయండి. ఒక రాగి చెంబులో నీళ్లు తీసుకుని తులసికోట దగ్గర అర్ఘ్యం ఇవ్వండి. ఇలా ప్రతిరోజు చేయడం వల్ల ఇంట్లోని కుటుంబ సభ్యులకు అనుకున్న పనులు అనుకున్నట్లుగా జరుగుతాయి.
కొబ్బరికాయ :
బయటకు వెళ్లేటప్పుడు పని త్వరగా పూర్తి కావాలంటే ఒక కొబ్బరి కాయ తీసుకోండి. దానికి పసుపు కుంకుమతో బొట్లు పెట్టి మీ వెంట ఏదైనా బ్యాగులో తీసుకెళ్లండి. మీ పని పూర్తయ్యాక ఆ కొబ్బరికాయను గణపతి ఆలయంలో ఇవ్వండి.
- పనిలో ఆటంకాలు ఎదురయ్యే వారు బయటకు వెళ్లేటప్పుడు కపిల గోవుకి బెల్లం తినిపించండి.
- వక్క గణపతిని ఇంట్లోని పూజ గదిలో ఏర్పాటు చేసుకోవాలి. రోజూ గణపతికి కుంకుమ బొట్లు పెట్టాలి. ఇలా చేయడం వల్ల మంచి ఫలితం కనిపిస్తుంది.
- మీరు ఎప్పుడైనా బయటకు వెళ్లేటప్పుడు మీ దగ్గర ఒక పసుపు కొమ్ము ఉంచుకోండి. పసుపు కొమ్ముకి కార్యసిద్ధిని కలిగింపజేసే శక్తి ఉంటుంది.
- అలాగే ఇంట్లో నుంచి బయటకు వెళ్లేటప్పుడు 'శ్రీం సర్వ సిద్ధికరాయ వర్ధమానాయ నమః' అనే మంత్రాన్ని 11 సార్లు మనసులో స్మరించుకోండి. ఇలా కొన్ని పరిహారాలను పాటించడం వల్ల అనుకున్న పనులు జరుగుతాయని మాచిరాజు కిరణ్ కుమార్ చెబుతున్నారు.
ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంత వరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.
ఫేమస్ కుబేర టెంపుల్- ఒకసారి దర్శిస్తే పేదరికం పరార్!
నాగ సాధువులకు ఆ శక్తి ఎలా వస్తుంది? - గడ్డకట్టే చలిలోనూ ఎలా ఉండగలుగుతున్నారో తెలుసా?