CAG Submitted Report on Kaleswaram Project to Govt :కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంపై కీలక రిపోర్టు(CAG Report on Kaleshwaram) సిద్ధమైంది. ప్రాజెక్టుపై ఆడిట్ నివేదికను కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించింది. ప్రాజెక్టు పనితీరుకు సంబంధించిన ఆడిట్ నివేదికను ప్రభుత్వానికి నివేదిక ఇచ్చినట్లు అకౌంటెంట్ జనరల్ తెలిపారు. శాసనసభ, మండలిలో ప్రవేశపెట్టేందుకు వీలుగా కాగ్ నివేదిక ఇచ్చినట్లు పేర్కొన్నారు.
మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణంలో పెద్దఎత్తున లోపాలు - విజిలెన్స్ దర్యాప్తులో విస్తుపోయే అంశాలు
ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్టు నుంచి రీఇంజినీరింగ్ అవసరం, చేసిన మార్పులు, రీఇంజినీరింగ్ విధానం, కాళేశ్వరం ప్రాజెక్టు ప్రణాళిక, పనులు, అంచనా వ్యయం, ఎకనామిక్ వయబిలిటీ, అనుమతులు, ఆర్థికవనరుల సమీకరణపై కాగ్ అడిట్ నిర్వహించింది. పనుల పురోగతి, భూసేకరణ, సహాయ - పునరావాసం, డిజైన్ల ఖరారు, ఒప్పందాలు, పర్యావరణ నిర్వహణా ప్రణాళిక, అంచనాల తయారీ, వృధా ఖర్చు, టెండర్ విధానం, చెల్లింపులపై కూడా ఆడిట్ నిర్వహించారు. వాటిపై లేవనెత్తిన అభ్యంతరాలను ముసాయిదాలో రాష్ట్ర ప్రభుత్వానికి పంపిన కాగ్, సర్కార్ ఇచ్చిన వివరణలను కూడా నివేదికలో పొందుపర్చింది. రానున్న బడ్జెట్ సమావేశాల్లో నివేదిక ఉభయసభల ముందుకు రానుంది.
కాళేశ్వరం ప్రాజెక్టు అధ్యయనానికి నిపుణుల కమిటీ ఏర్పాటుకు సీఎం రేవంత్‌రెడ్డి నిర్ణయం
Telangana Budget Sessions 2024 : రానున్న శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో కాళేశ్వరం ప్రాజెక్టుపై చర్చకు కాగ్ రిపోర్డు కీలకం కానుంది. ఇప్పటికే ఆర్ధిక, విద్యుత్ రంగాలపై శ్వేత పత్రాన్ని విడుదల చేసిన రేవంత్ సర్కార్, నీటి పారుదల రంగంపై కూడా శ్వేత పత్రం విడుదల చేయాలని భావించింది. అనుకోని పరిస్థితుల కారణంగా ప్రయత్నాన్ని విరమించుకుంది. ఎన్నికల ప్రచారం నుంచే కాళేశ్వరం ప్రాజెక్టుపై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం, కాగ్ రిపోర్డుతో ప్రాజెక్టు వ్యయాలను వెల్లడించి బీఆర్‌ఎస్‌ను(BRS) మరింత ఇరుకున పడేయాలని భావిస్తోంది.
ఇప్పటికే రాష్ట్రప్రభుత్వం మేడిగడ్డ పిల్లర్ల కుంగుబాటు వ్యవహారంపై విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌తో విచారణకు ఆదేశించింది. సిట్టింగ్ న్యాయమూర్తి చేత కూడా న్యాయవిచారణ జరిపిస్తామని సీఎం రేవంత్ పునరుద్ఘాటించారు. ఇందులో భాగంగా సిట్టింగ్ జడ్డిని కేటాయించాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) లేఖ రాశారు. అలాగే ప్రాజెక్టు అధ్యయనానికి నిపుణుల కమిటీ ఏర్పాటు చేయాలని నీటిపారుదల అధికారులను ఆదేశించారు. అంతకు ముందు మేడిగడ్డను పరిశీలించిన నేషనల్ డ్యాం సేప్టీ బృందం, నాలుగు అంశాలను ప్రస్తావిస్తూ నివేదిక ఇచ్చింది. ప్రాజెక్టు నిర్మాణంలో డిజైన్, కన్‌స్ట్రక్షన్, మెయింటేనెన్స్, క్వాలిటీ కంట్రోల్‌ను నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా పాటించలేదని తన నివేదికలో పేర్కొంది.
మరో 15 రోజుల్లో మేడిగడ్డ బ్యారేజ్ ఘటనపై సమగ్ర నివేదిక : విజిలెన్స్