CAG Report in Telangana Assembly Sessions 2024 : తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు ఆడిట్, రాష్ట్ర ఆర్థికరంగంపై కాగ్ నివేదికలను అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. రెవెన్యూ, జనరల్, సోషల్, ఆర్థిక రంగాలపై, పీయూసీలు, స్థానిక సంస్థలు, డీబీటీ ద్వారా ఆసరా పింఛన్లపై కాగ్ ఇచ్చిన నివేదికను డిప్యూటీ సీఎం, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క సభ ముందు ఉంచారు. ప్రాజెక్టు నిర్మాణం, రీ-ఇంజినీరింగ్, చేకూరిన ప్రయోజనాలు, నష్టాలను ఆడిట్ నివేదికలో కాగ్ సమగ్రంగా వివరించింది.
CAG Report On Kaleshwaram Project in Assembly :2008లో ఉమ్మడి రాష్ట్రంలో 16.40లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు సాగునీరందించే ఉద్దేశంతో 38వేల 500కోట్లతో చేపట్టిన ప్రాణహిత-చేవెళ్ల సుజల స్రవంతి ఎత్తిపోతల పథకాన్ని చేపట్టినట్లు తెలిపింది. కేంద్ర జలసంఘం ఆమోదం లేకుండానే 2008-2009 మధ్య కాలంలో ప్రాజెక్టు పనులను వివిధ కాంట్రాక్టర్లకు అప్పగించి, పనులు ప్రారంభించినట్లు వెల్లడించింది.
రాష్ట్ర విభజన అనంతరం, కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును, ప్రాణహిత, కాళేశ్వరం ప్రాజెక్టులుగా విభజించి ఈ రెండు ప్రాజెక్టులకు కలిపి మొత్తం 85వేల651.81 కోట్ల అంచనా వ్యయంతో మొత్తం 20.26 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు సాగునీరు అందించడంతో పాటు, ఇప్పటికే ఉన్న మరో నాలుగు ప్రాజెక్టులకు నీటి లోటును పూరించాలని భావించినట్లు వివరించింది. 2022 మార్చి చివరి నాటికి ప్రాణహిత ప్రాజెక్టుపై 17వేల 27.44 కోట్లు, కాళేశ్వరం ప్రాజెక్టుపై 86వేల788.06 కోట్లు ఖర్చు చేసినట్లు పేర్కొంది.
"ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు వాస్కాస్ రూపొందించిన డీపీఆర్‌లో అనేక లోపాలున్నప్పటికీ కాళేశ్వరం ప్రాజెక్టు బాధ్యతలను సైతం అదే సంస్థకు అప్పగించినట్లు వివరించింది. 2018 జూన్‌లో కేంద్ర జలసంఘం డీపీఆర్‌ను ఆమోదించడానికి ముందే సాగునీటి శాఖ ఈ ప్రాజెక్టుకు సంబందించి 25వేల 49.90 కోట్ల విలువగల 17 పనులను అప్పగించిందని, ఆమోదం తర్వాత కూడా ప్రాజెక్టు పనుల్లో మార్పులు చేసినట్లు తెలిపింది. కేంద్ర జలసంఘానికి సమర్పించిన డీపీఆర్‌లో ఈ ప్రాజెక్టు కోసం గోదావరి నది మంచి రోజుకు 2 టీఎంసీల చొప్పున నీటిని ఎత్తిపోయాలని ప్రతిపాదించినా, అవసరం లేకున్నా పంపింగ్ సామర్థ్యాన్ని రోజుకు 3 టీఎంసీలకు పెంచారని దీని కారణంగా 428.151 కోట్ల అదనపు వ్యయం అవుతుందని పేర్కొంది.
కాళేశ్వరం వ్యయం భారీగా పెరిగినప్పటికి ప్రయోజనాల్లో అదనపు పెరుగుదల లేదని, విద్యుత్ వినియోగానికి ఏటా రూ.3,555 అదనపు వ్యయం పెరిగిందని కాగ్ నివేదిక వెల్లడించింది. రీ ఇంజినీరింగ్, మార్పుల వల్ల అప్పటికే చేసిన కొన్ని పనులు నిరర్థకం అయ్యాయని, రీ ఇంజినీరింగ్, మార్పుల వల్ల రూ.765 కోట్ల నష్టం వాటిల్లిందని తెలిపింది. పనుల అప్పగింతలో నీటి పారుదల అనుచిత తొందరపాటు ప్రదర్శించిందని పేర్కొంది.