CAG on Mallannasagar Reservoir : కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో కీలకమైన, అత్యధికంగా 50 టీఎంసీల సామర్థ్యం కలిగిన మల్లన్నసాగర్ రిజర్వాయర్‌ను లోతైన భూకంప ప్రభావ అధ్యయనం లేకుండానే నిర్మించినట్లు కంప్రోల్టర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) తప్పుపట్టింది. దీనికి దిగువనే 10.3 లక్షల ఎకరాల ఆయకట్టు ఉందని తెలిపింది. రూ.6126.8 కోట్లతో చేపట్టిన ఈ రిజర్వాయర్‌ను 2022 ఫిబ్రవరిలో ప్రారంభించారని చెప్పింది. అయితే ఇప్పటివరకు అత్యవసర కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయలేదని పేర్కొంది. దీనివల్ల ఆనకట్ట తెగే సందర్భాలు ఎదురై స్పందించడంలో జాప్యం జరిగితే సమీపంలోని ప్రజల ప్రాణాలకు, ఆస్తులకు ప్రమాదం ఉంటుందని కాగ్ హెచ్చరించింది.
అంగీకారం రాకుండానే కాంట్రాక్టర్లకు పనులు :2016లో ప్రాథమిక డ్రాయింగ్స్ ఇచ్చేటప్పుడు స్థాన నిర్దిష్ట భూకంప అధ్యయనాలను చేయించాలని సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్(సీడీవో) నీటిపారుదల శాఖకు సూచించిందని కాగ్ తెలిపింది. ఆ ప్రకారం జాతీయ భూ భౌతిక పరిశోధన సంస్థ(ఎన్‌జీఆర్‌ఐ)కు లేఖ రాసిన నీటిపారుదల శాఖ దాని అంగీకారం రాకుండానే కాంట్రాక్టర్లకు పనులు ఇచ్చి 2020 డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టిందని కాగ్ ఆక్షేపించింది.
డ్రాయింగ్‌లో ఒకలా, కట్టింది మరోలా - 'మేడిగడ్డ' అంతా లోపాలమయం
భూకంప తీవ్రత-6లో రిజర్వాయర్ :మరోవైపు 2018లో దీనిపై ఎన్‌జీఆర్‌ఐ ప్రాథమిక నివేదిక ఇచ్చిందని కాగ్ పేర్కొంది. తెలంగాణ భూకంప జోన్ -2లో ఉందని, గత మూడు, నాలుగు దశాబ్దాల్లో వచ్చిన భూకంప ప్రభావాలను ప్రస్తావిస్తూ భూకంప తీవ్రత-6లో మల్లన్నసాగర్ జలాశయం (Mallannasagar Reservoir) ఉందని తెలిపినట్లు వెల్లడించింది. భూకంప ప్రభావంపై లోతైన అధ్యయనం చేయాలని ఎన్‌జీఆర్‌ఐ సిఫార్సు చేసినా ఎక్కడా సమగ్ర సర్వే నిర్వహించకుండా జలాశయ నిర్మాణాన్ని కొనసాగించారని కాగ్ స్పష్టం చేసింది.