Public Rush For Elections :రాష్ట్రంలో ఎన్నికల పండగ సమీపిస్తుండటంతో తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు ప్రజలు వారి సొంత గ్రామాల బాటపడుతున్నారు. దీంతో ఒక్కసారిగా టోల్‌ప్లాజాలు, బస్టాండ్లు, రైల్వేస్టేషన్ల వద్ద రద్దీ నెలకొంది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి, కేతేపల్లి మండలం కోర్లపహాడ్ టోల్‌ప్లాజాల వద్ద వాహనాల రద్దీ ఏర్పడింది. ఎన్నికల వేళ ఓటు హక్కు వినియోగించుకోవడానికి తెలంగాణలో ఉన్న ఏపీ ఓటర్లు సొంతూళ్లకు తరలివెళ్తున్నారు.
బారులు తీరిన వాహనాలు :సొంతూళ్లకు ప్రజలు వెళ్తున్నవేళ ఎక్కడిక్కడ రద్దీ నెలకొంది.దీంతో హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారిపై వాహనాలు బారులు తీరాయి. వరుస సెలవులు రావడంతో కార్లు, బస్సుల్లో ప్రయాణికులు తరలివెళ్తున్నారు. మండే ఎండలో కూడా ఇంతగా రద్దీ ఉంటే ఈ సాయంత్రం నుంచి వాహనాల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉంది.
కష్టతరమైన ప్రయాణం :ఓటు హక్కు వినియోగించుకునేందుకు సొంత ఊర్లకు వెళ్లే వారికి ప్రయాణం కష్టతరంగా మారింది. ముందుగా బుక్ చేసుకుందామనుకున్నప్పటికీ అప్పటికే బస్సు టికెట్లు బుక్ అయ్యి ప్రస్తుతం ఏదో విధంగా వెళ్దామని బస్సుల రైళ్ల వద్దకు చేరుకుంటున్నారు. కూకట్పల్లి నుంచి ఆంధ్రప్రదేశ్‌లో ఓటు హక్కును వినియోగించుకునేందుకు వెళ్తున్న వారికి ఎన్నికల సంఘం ఇలాంటి క్లిష్టమైన సమయంలో రవాణా ఏర్పాట్లు చేస్తే బాగుంటుందని పలువురు అభిప్రాయపడ్డారు.