Bugga Rameswara Swamy Temple EO Scam :దేవుడిపై భక్తితో తమ ఇలవేల్పునకు భక్తులు ఇచ్చిన సొమ్మునే గుట్టుగా బొక్కేసిన ఘటన కర్నూలు జిల్లాలో వెలుగుచూసింది. అది కూడా వేలు, లక్షలు కాదు ఏకంగా కోటి రూపాయలకు పైగా అక్రమంగా స్వాహా చేశారు. దేవస్థానం ఆస్తులను పరిరక్షించాల్సిన ఈవోనే ఈ దోపిడీకి పాల్పడటం విస్తుపోయేలా చేసింది. ఈవో తీరుపై ప్రజాసంఘాలు అనుమానం వ్యక్తం చేశాయి. దోపిడీ నిజమేనని నిర్ధారణ కావడంతో ప్రభుత్వం అతన్ని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులిచ్చింది.
కోటికి పైగా ఈవో ఖాతాకు మళ్లింపు : కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం కాల్వబుగ్గలోని బుగ్గరామేశ్వరస్వామి ఆలయం ఎంతో పురాతనమైంది. తెలుగు రాష్ట్రాలు సహా ఇతర ప్రాంతాల నుంచి ఎంతో మంది భక్తులు ఈ ఆలయానికి వస్తుంటారు. 2018 నుంచి 2024 వరకు డీఆర్‌కేవీ ప్రసాద్ ఇక్కడ ఈవోగా పని చేశారు. ఆలయ అభివృద్ధి ముసుగులో దాతల నుంచి ఏటా లక్షల్లో విరాళాలు సేకరించేవారు. ఆలయ భూముల వేలం, ఆలయ భూముల్లో హైటెన్షన్ విద్యుత్ టవర్లు నిర్మించడం వల్ల వచ్చిన పరిహారం సొమ్మును ఆలయ ఖాతాలోకి జమ చేసేవారు. ఈ నిధులపై ఈవో ప్రసాద్ కన్నుపడింది.
వామ్మో ఇదేందయ్యా ఇదీ - ఆలయ ప్రాంతంలో మద్యం తాగిన ఈవో - వీడియో వైరల్ - EO drinking alcohol in temple
వాటిని ఎలాగైనా కొల్లగొట్టాలని పథకం రచించారు. అనుకున్నదే తడవుగా 2020లో హుసేనాపురం ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకులో వ్యక్తిగత ఖాతా తెరిచారు. ఆలయ నిధులను దశలవారీగా తన సొంత ఖాతాకు మళ్లించుకుని క్రమంగా వాటిని విత్ డ్రా చేస్తూ వచ్చారు. ఇటీవల ప్రసాద్‌ను యాగంటికి బదిలీ చేశారు. దీంతో అప్రమత్తమైన ఈవో ఈ ఏడాది సెప్టెంబర్ 30న వ్యక్తిగత ఖాతాను క్లోజ్ చేశారు. దీంతో అనుమానం వచ్చిన ప్రజాసంఘాలు దీనిపై కూపీ లాగగా కోటికి పైగా ఆలయ డబ్బులు ఈవో ఖాతాకు మళ్లినట్లుగా తేలింది.