Police Damage Cockfight Arenas : సంక్రాంతి అనగానే పల్లెల పచ్చందాలు, రంగవల్లులు, గొబ్బెమ్మలు, బసవన్నలు, పిండివంటలు గుర్తుకు వస్తాయి. ఇలా ఎన్ని ఉన్నా కోడి పందేలది మాత్రం ప్రత్యేక స్థానం. వారూ వీరూ అనే తేడా లేకుండా అందరి చూపూ వాటి పైనే ఉంటుంది. ఈ నేపథ్యంలోనే పండగ బరిలో కాలుదువ్వేందుకు పందెం కోళ్లు సై అంటున్నాయి. బరిలే నిలిచేందుకు కొన్ని నెలల పాటు ప్రత్యేక శిక్షణ పొంది, రాటుదేలిన కోళ్లు తమ సత్తా చాటేందుకు ఉవ్విళ్లూరుతున్నాయి. మూడు రోజుల వేడుకలో ప్రత్యేకంగా నిలిచే కోడి పందేలను భారీగా నిర్వహించేందుకు బెట్టింగ్ బాబులు రాష్ట్రంలో పలుచోట్ల బరులను ఏర్పాటుచేశారు.
అప్రత్తమైన పోలీసులు : ఈ క్రమంలోనే పోలీసులు అప్రత్తమయ్యారు. సంప్రదాయ క్రీడలు మాత్రమే ఆడాలని కోడి పందేలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. ఇటీవలే హైకోర్టు కూడా రాష్ట్రంలో కోడి పందేలు, జంతు హింస జరగకుండా చూడాలని పోలీసులను ఆదేశించిన విషయం తెలిసిందే. తాజాగా రాష్ట్రంలో వేర్వేరు ఘటనల్లో పందేల కోసం ఏర్పాటు చేసిన బరులను పోలీసులు ధ్వసం చేశారు.
బాపట్ల జిల్లా వేమూరు మండలం జంపని గ్రామ సమీపంలోని షుగర్ ఫ్యాక్టరీ వద్ద ఏర్పాటు చేసిన బరిని పోలీసులు ట్రాక్టర్‌తో ధ్వంసం చేశారు. బరి చుట్టూ ఏర్పాటు చేసిన జెండాలు, టెంట్లను తీసివేశారు. సంక్రాంతి పండగను ప్రశాంతమైన వాతావరణంలో కుటుంబ సభ్యులతో జరుపుకోవాలని పోలీసులు సూచించారు. కోడి పందేలు, జూద క్రీడలకు దూరంగా ఉండాలని చెప్పారు. ఎవరైనా చట్టాన్ని అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇటువంటి వాటిపై సమాచారం తెలిస్తే వెంటనే 112కు లేదా స్థానిక పోలీసులకు తెలియజేయాలని పేర్కొన్నారు.
Sankranti Kodi Pandalu in AP : విజయవాడ పటమట స్టేషన్ పరిధిలోని రామలింగేశ్వరనగర్, పటమటలంక రామవరప్పాడు, ఎనికేపాడు గ్రామాల్లో పోలీసులు సోదాలు నిర్వహించారు. ఈ క్రమంలోనే కోడి పందేల కోసం ఏర్పాటు చేసిన బరులను ధ్వసం చేసి టెంట్లను తొలగించారు. పండగ పేరు చెప్పి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ పవన్‌కిషోర్ హెచ్చరించారు.