KTR Files Case On Minister Konda Surekha : మంత్రి కొండా సురేఖపై బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పరువు నష్టం దావా వేశారు. ఇవాళ నాంపల్లి ప్రత్యేక కోర్టులో ఆయన తరఫు న్యాయవాది ఉమామహేశ్వర్‌రావు దీనికి సంబంధించిన పిటిషన్ దాఖలు చేశారు. బీఆర్ఎస్ నేతలు బాల్క సుమన్, సత్యవతి రాఠోడ్, తుల ఉమా, దాసోజు శ్రవణ్‌ను సాక్షులుగా ఉన్నట్లు తెలిపారు. ఇటీవల మంత్రి కొండా సురేఖ మీడియాతో మాట్లాడుతూ సినీ పరిశ్రమలోని పలువురుని ప్రస్తావిస్తూ కేటీఆర్‌పై తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.
" 2014-2023 వరకు కేసీఆర్ ప్రభుత్వ కేబినెట్లో మంత్రిగా పనిచేశాను. 5 సార్లు వరుసగా సిరిసిల్ల నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్నాను. 9ఏళ్లు మంత్రిగా పనిచేశాను. ప్రస్తుతం బీఆర్‌ఎస్ పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్నాను. సమాజంలో గౌరవప్రదమైన స్థానంలో ఉన్నాను. మంత్రిగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేశాను. ప్రపంచంలోని బహుళజాతి సంస్థలు ఇక్కడ పెట్టుబడులు పెట్టేవిధంగా పనిచేశాను. తెలంగాణ వేగంగా అభివృద్ది చెందడంలో కృషి చేశాను."- కేటీఆర్, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు