BRS Action On Party Defections : శాసనసభ ఎన్నికలతో పాటు లోక్‌సభ ఎన్నికల్లో ఓటమి పాలైన భారత్ రాష్ట్ర సమితికి ఫిరాయింపులు పెద్ద తలనొప్పినే తీసుకొచ్చాయి. ఒక్కొక్కరుగా నేతలు గులాబీ పార్టీకి గుడ్ బై చెబుతున్నారు. ప్రత్యేకించి శాసనసభ్యులు పార్టీని వీడడం కలవరపాటుకు గురి చేస్తోంది. 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున 39 మంది ఎమ్మెల్యేలు గెలుపొందగా కంటోన్మెంట్ సభ్యురాలు లాస్య నందిత ఆకస్మిక మరణంతో పార్టీ బలం 38కి పడిపోయింది. అందులో పది మంది శాసనసభ్యులు ఇప్పటికే గులాబీ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు.
అంటే ఇప్పటికే నాలుగో వంతుకు పైగా ఎమ్మెల్యేలు పార్టీని వీడారు. వారితో పాటు ఆరుగురు ఎమ్మెల్సీలు కూడా కారు నుంచి దిగిపోయారు. మరికొంత మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా బీఆర్ఎస్ను వీడతారని కాంగ్రెస్ నేతలు బలంగా చెబుతున్నారు. వరుసగా ఎమ్మెల్యేలు పార్టీని వీడుతున్న తరుణంలో ఫిరాయింపుల విషయంలో దూకుడుగా వెళ్లాలని బీఆర్ఎస్ భావిస్తోంది. పార్టీ మారిన 10 మంది శాసనసభ్యులపై అనర్హత వేటు వేయాలని ఇప్పటికే ఫిర్యాదు కూడా చేశారు.
మొదట దానం నాగేందర్‌పై అనర్హతా పిటిషన్‌ను సభాపతికి ఇచ్చారు. ఆ తర్వాత స్పీకర్ సమయం ఇవ్వకపోవడంతో మెయిల్, వాట్సప్, స్పీడ్ పోస్ట్ ద్వారా పంపారు. సభాపతి పిటిషన్లు తీసుకోవడం లేదని హైకోర్టును కూడా గులాబీ పార్టీ ఆశ్రయించింది. తాజాగా తొమ్మిది మంది పిటిషన్లను కూడా సభాపతి ప్రసాద్ కుమార్‌కు అందించారు. పార్టీ ఫిరాయింపులపై సుప్రీంకోర్టు తీర్పు స్పష్టంగా ఉందని, మూడు నెలల్లోపు చర్య తీసుకోవాల్సిందేనని బీఆర్ఎస్ అంటోంది.
'బీఆర్ఎస్ ఎమ్మెల్యేల హక్కులకు భంగం - ప్రొటోకాల్ విషయంలో స్పీకర్ చర్యలు తీసుకోవాలి' - BRS Leaders Letter to Speaker
సభాపతి నుంచి స్పందన లేకపోతే తాము సుప్రీంకోర్టును ఆశ్రయించడం ఖాయమని బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. మణిపూర్, మహారాష్ట్రలో ఎమ్మెల్యేల ఫిరాయింపు విషయంలో ఇటీవల సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును వారు ప్రధానంగా ప్రస్తావిస్తూ వస్తున్నారు. పిటిషన్ దాఖలైన మూడు నెలల్లోపు సభాపతి చర్యలు తీసుకోవాల్సిందేనని అంటున్నారు. రాజ్యాంగ ధర్మాసనం కూడా తీర్పును సమర్థించిందని పేర్కొంటున్నారు. ఇటీవల దిల్లీ పర్యటనలో కేటీఆర్, హరీశ్‌రావు ఈ అంశంపై ప్రధానంగా దృష్టి సారించినట్లు చెప్తున్నారు.
తమిళనాడు, మణిపూర్, మహారాష్ట్రలోని పార్టీ ఫిరాయింపుల కేసులను వాదించిన న్యాయవాదులతో సమావేశమై చర్చించినట్లు సమాచారం. సుప్రీంకోర్టులో కేసు దాఖలు చేసేందుకు రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. మూడింట రెండొంతుల మంది ఎమ్మెల్యేలను చేర్చుకోవడం ద్వారా బీఆర్ఎస్ శాసనసభా పక్షాన్ని సీఎల్పీలో విలీనం చేసుకుంటామని కాంగ్రెస్ నేతలు చెప్తూ వస్తున్నారు. అయితే 2023లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం ఇపుడు అది అంత సులువు కాదని బీఆర్ఎస్ అంటోంది.
విలీనం అంటే ప్రధాన పార్టీలోని గ్రామస్థాయి మొదలు రాష్ట్ర స్థాయి వరకు విలీనం కోసం తీర్మానం చేయాలని, ఆ తర్వాతే శాసనసభా పక్షం విలీనం సాధ్యమవుతోందని చెప్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీని వీడి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేల శాసనసభ్యత్వాలు రద్దు కావడం, ఆ స్థానాల్లో ఉపఎన్నికలు రావడం ఖాయమని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు.
పార్టీ ఫిరాయింపుల అంశంపై ప్రస్తుతం హైకోర్టులో కేసు నడుస్తోంది. గతంలో తమిళనాడులో పార్టీ ఫిరాయింపుల కేసును వాదించిన సీనియర్ న్యాయవాది సుందరం బీఆర్ఎస్ తరపున వాదనలు వినిపిస్తున్నారు. హైకోర్టు తీర్పును అనుసరించి తదుపరి కార్యాచరణ ఉంటుందని బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. ఫిరాయింపుల అంశంపై దూకుడుగా వెళ్లడం ద్వారా పార్టీ మారే విషయంలో రెండో ఆలోచన చేసే అవకాశం లేకపోలేదని బీఆర్ఎస్ వర్గాలు అంటున్నాయి.
కాస్కోండి మీ ఇలాకాలో బై ఎలక్షన్ ఖాయం - కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేలపై హరీశ్ రావు ఫైర్ - Harish Rao on Party Defections