Adilabad People Terrorized by Tiger Attacks : పులి వరుస దాడులతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఉలిక్కిపడుతోంది. ఒక్కరోజు వ్యవధిలోనే బెబ్బులి పంజాకు ఓ మహిళ విగతజీవిగా మారగా, మరో రైతు ప్రాణాలతో బయటపడ్డాడు. చేన్లలో పత్తి ఏరే సమయం కావడంతో, వ్యాఘ్రం భయం రైతులను వెంటాడుతోంది. కొందరైతే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని చేన్లలోకి వెళ్తుండగా, మరికొన్నిచోట్ల ఆ వైపు కూడా కనీసం చూడటం లేదు. బెబ్బులి ఎటు నుంచి ఎటు పోతోంది, ఏయే ప్రాంతాల్లో తిరుగుతుందనేది అటవీ అధికారుల వద్ద సరైన సమాచారం లేకపోవడం ప్రజలకు తీరని శాపంలా మారింది.
పులి కదలికలపై కనీస సమాచారం లేదు
కాగజ్‌నగర్ మండలం విలేజ్ నం.11 సమీపంలో పత్తి చేనులో శుక్రవారం లక్ష్మిపై దాడి చేసి చంపేసిన పులి ఎటు వెళ్లిందో ఫారెస్ట్ ఆఫీసర్లు పసిగట్టలేకపోయిన తీరుకు నిదర్శనమే.. దుబ్బగూడలో రైతు సురేశ్‌పై మరో దాడి. భార్యాభర్తలిద్దరూ కేకలు వేయడం, రాళ్లతో కొట్టడంతో.. కనీసం రైతు సురేశ్ ప్రాణాలతో బయటపడ్డారు. విలేజ్ నం.11కు దుబ్బగూడెం మధ్య సుమారు 15 కిలో మీటర్ల దూరం ఉంటుంది. మహిళపై దాడి అనంతరం బెబ్బులి కదలికల పట్ల అధికారులు కచ్చితమైన సమాచారం సేకరించి ఆయా గ్రామాల ప్రజలను అప్రమత్తం చేయాల్సిన అవసరం ఉంది.
కాగా సురేశ్‌పై దాడి ప్రదేశాన్ని అధికారులు పరిశీలిస్తున్న క్రమంలో గ్రామస్థులు ఈ విషయం గురించి చర్చించి వాగ్వాదానికి దిగారు. పులి కదలికల గురించి కనీస సమాచారం సైతం ఇవ్వడం లేదని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా లక్ష్మి ఘటనపై స్పందించిన కాగజ్‌నగర్ అటవీశాఖ అధికారులు శుక్రవారం రాత్రి నుంచే 06 బృందాలు వేంపల్లి సెక్షన్ పరిధిలోని విలేజ్ నం.10, 5, 9, 13, 11, అనుకోడ, కడంబా, ఆరెగూడ, బాపునగర్ శివారు ప్రాంతాల్లో పులి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. విలేజ్ నం.12లో టెక్నాలజీని వాడి డ్రోన్ కెమెరాతో గాలించారు.
పరిసర గ్రామాల్లో భయాందోళన
గన్నారం విలేజ్‌కు చెందిన లక్ష్మి మృతితో, గ్రామస్థులు మరింత భయాందోళనలో ఉన్నారు. పులి దాడి అనంతరం వీధులన్నీ నిర్మానుష్యంగా మారాయి. చేన్లలో పత్తి తీయడానికి వెళ్లే కూలీలు సైతం ఇంటి వద్దే ఖాళీగా ఉంటున్నారు. సమీప గ్రామాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది.
144 సెక్షన్ అమలు
కాగజ్‌నగర్, సిర్పూర్(టి) మండలంలోని ఫారెస్ట్ పరిసర ప్రాంతాల్లో పులి సంచరిస్తున్నందున, 15 గ్రామాల్లో 144 సెక్షన్ అమలు చేస్తున్నట్లు ఫారెస్ట్ ఆఫీసర్లు పేర్కొన్నారు. ఈజ్‌గాం, నజ్రుల్‌నగర్, విలేజ్ నం.11,6,13, వేంపల్లి, చుంచుపల్లి, పెద్దబండ, అచ్చెల్లి, అనుకోడ, గన్నారం, మోసం, కడంబ, దుబ్బగూడ పలు గ్రామాల్లో విధించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వ్యాఘ్రం కనిపించిన వెంటనే సమాచారం ఇవ్వాలని అధికారులు సూచించారు.
ఒకటి కాదు రెండు పులులు
"సురేశ్ చేను పక్కనే నా పొలం ఉంది. పులి అతనిపై దాడి చేయకముందే భారీ శబ్దంతో గాండ్రింపులు నాకు సమీపలో వినిపించాయి. భయంతో అతనికి నేను కాల్ చేశాను. అప్పటికే అతనిపై పులి పంజా విసిరి, గాయపరిచింది. ఐతే అక్కడ నాకు రెండు పులులు కనిపించాయి."-ఆనంద్‌రావు, ప్రత్యక్ష సాక్షి, దుబ్బగూడ
సమాచారం ఇవ్వలేదు
"గన్నారం సమీపంలో లక్ష్మిని హతమార్చిన బెబ్బులి ఎటువైపు వెళ్లిందో ఫారెస్ట్ ఆఫీసర్లు చెప్పలేదు. మా గ్రామం వైపు వస్తుందని ముందుగా చెబితే మేము చేన్లలోకి వెళ్లకపోయేవాళ్లం. అధికారులు ఎవరూ సరైన సమాచారం ఇవ్వలేదు. సురేశ్‌పై దాడి చేసినది సైతం ఎటు వెళ్లిందో వీరు ఇప్పటకీ చెప్పలేకపోతున్నారు." -లోకేశ్, దుబ్బగూడ
పులి కదలికలు కనిపిస్తే ఇలా చేయండి - ఆ మాస్కులు పెట్టుకుంటే మీరు సేఫ్