KTR Response On HC Verdict Regarding MLAs Disqualification Case :పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేల విషయంలో నాలుగు వారాల్లో నిర్ణయం తీసుకోవాలంటూ రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నట్లు బీఆర్ఎస్ కార్యనిర్వహక అధ్యక్షుడు కేటీఆర్ తెలిపారు. ఓ వైపు పార్టీ ఫిరాయింపుల విషయంలో కఠినమైన చట్టం తెస్తామంటూ ఎన్నికల సందర్భంగా మాటిచ్చి, ఆ తర్వాత పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించిన కాంగ్రెస్ పార్టీకి ఇది చెంపపెట్టులాంటి తీర్పని అన్నారు. మొదట్నుంచీ చెబుతున్నట్లే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు తప్పవని కేటీఆర్ అన్నారు.
పార్టీ ఫిరాయింపుల విషయంలో సుప్రీంకోర్టు చాలా సీరియస్గా ఉందన్న ఆయన, ఒక పార్టీ గుర్తు మీద గెలిచి మరొక పార్టీలోకి వెళ్లటం నమ్మి ఓట్లు వేసిన ప్రజలను మోసం చేయడమేనని వ్యాఖ్యానించారు. అదే విషయాన్ని కోర్టులు కూడా స్పష్టం చేశాయని పేర్కొన్నారు. పార్టీ ఫిరాయింపుల విషయంలో ఫిర్యాదు అందిన మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని గతంలోనే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని, అయినప్పటికీ సభాపతి సుప్రీంకోర్టు తీర్పును కూడా లెక్కచేయకపోవడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు.
రేవంత్ మాటలు నమ్మి అడ్డంగా మోసపోయిన పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేలను చూస్తే జాలేస్తోందని కేటీఆర్ అన్నారు. పార్టీ ఫిరాయింపుల విషయంలో రాహుల్ గాంధీ వైఖరిపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఊసరవెల్లి కూడా రాహుల్ గాంధీని చూసి సిగ్గుపడుతుందన్న ఆయన, ఓ వైపు రాజ్యాంగం, ప్రజాస్వామ్య పరిరక్షణ అంటూ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని విమర్శించారు. ప్రజల సమస్యలు గాలికి వదిలి, పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించిన కాంగ్రెస్ పార్టీకి అటు న్యాయస్థానంలోనూ, ఇటు ప్రజాక్షేత్రంలోనూ గుణపాఠం తప్పదని కేటీఆర్ హెచ్చరించారు. వచ్చే ఉపఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ బుద్ది చెబుతారని అన్నారు.