ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కేసీఆర్​కి షాక్​ ఇస్తున్న బీఆర్​ఎస్​ నేతలు- కాంగ్రెస్‌ కండువా కప్పుకున్న మరో ఎమ్మెల్యే - BRS MLA Joined Congress

BRS MLA Join in Congress: తెలంగాణలో హస్తం పార్టీ ఆపరేషన్ ఆకర్ష్​కు ఆకర్షితులవుతున్న చాలా మంది బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు 'కారు' దిగి కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే బీఆర్​ఎస్ నుంచి ఏడుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్​లో చేరగా, తాజాగా మరో ఎమ్మెల్యే కాంగ్రెస్ గూటికి చేరారు. హైదరాబాద్‌లోని సీఎం నివాసంలో రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్‌ గౌడ్ హస్తం తీర్థం పుచ్చుకున్నారు. ఈయనతో కలిపి ఇప్పటి వరకు బీఆర్‌ఎస్‌ను వీడిన శాసనసభ్యుల సంఖ్య 8కి చేరింది.

brs_mla_joined_congress
brs_mla_joined_congress (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 12, 2024, 10:34 PM IST

BRS MLA Join in Congress:తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్‌ గౌడ్ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌ రెడ్డి, ఖైరతాబాద్‌ డీసీసీ అధ్యక్షుడు రోహిన్‌ రెడ్డిలతో కలిసి జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసానికి ప్రకాశ్‌ గౌడ్‌ వచ్చారు. ఆ తర్వాత సీఎం రేవంత్‌ రెడ్డి ప్రకాశ్‌ గౌడ్‌కు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అదేవిధంగా ఆయన అనుచరులు కూడా సీఎం సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరారు.

ప్రకాశ్‌ గౌడ్‌తో కలిపి ఇప్పటి వరకు బీఆర్‌ఎస్‌ నుంచి 8 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరారు. కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాస్‌ రెడ్డి, దానం నాగేందర్‌, కాలె యాదయ్య, తెల్లం వెంకట్రావు, డాక్టర్‌ సంజయ్‌ కుమార్‌, బండ్ల కృష్ణ మోహన్‌ రెడ్డిలు ఇప్పటికే పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. రేపో, ఎల్లుండో మరో నలుగురు ఎమ్మెల్యేలు బీఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రెస్‌లో చేరే అవకాశం ఉందని పీసీసీ వర్గాలు వెల్లడించాయి.

ఓ వైపు ప్రపంచ బ్యాంకు అధికారులు-మరోవైపు సమీక్షలతో బిజిబజీగా పవన్ కల్యాణ్ - Pawan Met WorldBank Representatives

గతంలోనే ప్రచారం జరిగినా : అయితే ప్రకాశ్ గౌడ్ బీఆర్​ఎస్​ను వీడతారంటూ గతంలోనే పెద్ద ఎత్తున ప్రచారం జరిగినా, అలాంటిదేమీ లేదంటూ ఆయన ఖండిస్తూ వచ్చారు. తాజాగా నేడు 'కారు' దిగి హస్తం తీర్థం పుచ్చుకున్నారు. నేడు తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆయన 'స్వామివారి దర్శనం తర్వాత కీలక నిర్ణయం తీసుకున్నా. కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నా. నాతో పాటు చాలా మంది కాంగ్రెస్‌లో చేరికకు ఉత్సాహంగా ఉన్నారు. రాత్రి 7 గంటలకు సీఎం రేవంత్ రెడ్డిని కలిసి పార్టీలో చేరబోతున్నా. నియోజకవర్గ రైతులు, ప్రజల అభివృద్ధి కోసమే ఈ నిర్ణయం తీసుకున్నా. నామీద ఎవరి ఒత్తిడి లేదు. నన్ను ఎవరూ బెదిరించలేదు' అని స్పష్టం చేశారు. ఆ ప్రకారమే రాత్రి 7 గంటల సమయంలో రేవంత్ సమక్షంలో కాంగ్రెస్ గూటికి చేరారు.

ఇటీవలే కేసీఆర్‌ను కలిసి వచ్చి : అయితే నగరానికి చెందిన తమ పార్టీ ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున కాంగ్రెస్‌లో చేరనున్నట్లు వచ్చిన వార్తల నేపథ్యంలో బీఆర్​ఎస్​ అధినేత కేసీఆర్ వారం క్రితమే వారందరిని తన ఫాంహౌస్‌కు పిలిపించుకున్నారు. వారితో సుదీర్ఘంగా చర్చించారు. తాము ఎట్టి పరిస్థితుల్లోనూ బీఆర్​ఎస్​ను విడిచి వెళ్లేది లేదంటూ శాసనసభ్యులంతా హామీ ఇచ్చి వచ్చారు. వారిలో ప్రకాశ్‌ గౌడ్‌ కూడా ఉండటం గమనార్హం. అలా హామీ ఇచ్చిన ఎమ్మెల్యేల్లో ఈయనతో పాటు మరికొందరు కాంగ్రెస్‌లో చేరడానికి సిద్ధంగా ఉండటం విశేషం.

మంటల్లో నీటిపారుదల శాఖ ఫైళ్లు- ప్రమాదమా? ప్రణాళికలో భాగమా?

'తల్లికి వందనం' పథకానికి ఇంకా మార్గదర్శకాలు ఖరారు కాలేదు: విద్యాశాఖ - Talliki Vandanam Scheme 2024

ABOUT THE AUTHOR

...view details