Harish Rao on Donation for Flood Victims : ఖమ్మం వరద బాధితులకు సాయం అందించేలా కేసీఆర్ ఆదేశాల మేరకు తమ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఒక నెల జీతాన్ని విరాళంగా ఇస్తున్నామని బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీమంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన, బీఆర్ఎస్ ప్రతినిధులు ఒక నెల జీతం విరాళంగా ప్రకటించారు. ఖమ్మం వరదలపై కేసీఆర్ విచారం వ్యక్తం చేశారని, బాధితులకు సాయం అందించాలని ఆయన ఆదేశించారని తెలిపారు. నిత్యావసర సరుకులను గురువారం సిద్దిపేట నుంచి ఖమ్మం వరద బాధితుల ఇంటింటికి అందిస్తామని చెప్పారు. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు ఖమ్మంలో వరదలు వచ్చాయని వివరించారు.
తాను ఖమ్మం వెళ్లి వరద బాధితులను పరామర్శించానని హరీశ్‌రావు చెప్పారు. వారిని చూస్తే తన కళ్లలో కన్నీళ్లు వచ్చాయని తెలిపారు. వరద బాధితులకు సహాయం చేయడానికి అందరు ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. బుధవారం సిద్దిపేటలో అమర్నాథ్ సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన మట్టి వినాయకుల పంపిణీ కార్యక్రమంలో హరీశ్‌రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానికులకు మట్టి వినాయకుని పంపిణీ చేశారు. చెరువులను కాపాడడం మన అందరి బాధ్యత అని, మట్టి వినాయకులను పూజిద్దామని చెప్పారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్‌తో చెరువులో చేపలు చనిపోతున్నవి, పర్యావరణం, చెరువులను కాపాడుకుందామని ఆయన వ్యాఖ్యానించారు.
'ఖమ్మం వరద బాధితులకు సహాయం చేయడానికి సిద్దిపేట నుంచి సరకులు పంపిస్తున్నాం. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీల ఒక నెల జీతం విరాళంగా ఇస్తున్నాం. ఖమ్మం వరదలపై మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నాకు ఫోన్ చేసి విచారం వ్యక్తం చేశారు. బాధితులకు సాయం అందించాలని చెప్పారు'-హరీశ్‌రావు, మాజీమంత్రి