Harish Rao On CM Revanth Runa Mafi Promise :రుణమాఫీ విషయంలో దేవుళ్లను కూడా సీఎం రేవంత్‌రెడ్డి మోసం చేశారని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. ఏ దేవుళ్లపై ఒట్లు పెట్టారో ఆయా ఆలయాలకు వెళ్లి పాప ప్రాయశ్చిత్తం చేసుకోవాలని డిమాండ్ చేశారు. యాదాద్రి లక్ష్మి నరసింహస్వామిని హరీశ్ రావు దర్శించుకున్న అనంతరం హరీశ్ రావు మాట్లాడారు.
ప్రజలను రక్షించమని కోరుకున్నా : పాలకుడు పాపం చేస్తే ప్రజలకు అరిష్టం అని బ్రాహ్మణ ఉత్తములు చెప్పారని ప్రజలకు అరిష్టం కలగకుండా పాపం చేసిన సీఎంను క్షమించమని, ప్రజలను రక్షించమని యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామిని వేడుకున్నానని తెలిపారు. రైతులందరికీ రుణమాఫీ, పంటల బోనస్ ఇచ్చేంత వరుకు పోరాడే శక్తిని ఇవ్వాలని వేడుకున్నాని అన్నారు. రుణమాఫీ పూర్తైందని సీఎం చెబుతున్నారని మంత్రులు మాత్రం ఇంకా చేయాల్సింది ఉందని చెబుతున్నారని ప్రజలు ఎవరి మాటలను నమ్మాలని ప్రశ్నించారు.
హామీ ఇచ్చిన పథకాలు అమలు చేయాలి: మంత్రులు చెప్పే లెక్క ప్రకారం రాజీనామా ఎవరు చేయాలో చెప్పాలని రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. రేవంత్‌రెడ్డికి నీతి, నిజాయతీ ఉంటే తెలంగాణ ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఏ దేవుళ్లపై ఒట్లు పెట్టారో ఆ దేవుళ్ల వద్దకు వెళ్లి రేవంత్‌రెడ్డి ప్రాయశ్చిత్తం చేసుకోవాలని సూచించారు. రూ.4 వేల రూపాయల పింఛన్ కోసం వృద్ధులు, వితంతువులు ఎదురుచూస్తున్నారని వాటిని అమలు చేయాలని తెలిపారు. మహిళలకు రూ.2500 ఇస్తానని హామీ ఇచ్చారని వారు అడుగుతున్నారని వారికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.