BRS Leaders Protest about Rythu Bharosa :సార్వత్రిక ఎన్నికలు ముగియడంతో కాంగ్రెస్ సర్కార్‌పై భారత రాష్ట్ర సమితి పోరు బావుటా ఎగరేసింది. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా మోసగిస్తోందంటూ నిరసన బాట పట్టింది. కాంగ్రెస్ అవలంబిస్తున్న రైతు వ్యతిరేక విధానాలను నిరసించాలన్న కేసీఆర్ పిలుపుతో బీఆర్ఎస్ శ్రేణులు రోడ్డెక్కాయి. మాజీ మంత్రి జోగురామన్న ఆధ్వర్యంలో ఆదిలాబాద్‌లో ర్యాలీ అనంతరం రోడ్డుపై వడ్లను పోసి నిరసన తెలిపారు. సన్నాలకు మాత్రమే బోనస్ చెల్లిస్తామంటోందంటూ ఆసిఫాబాద్‌లో నల్ల జెండాలు ప్రదర్శించారు.
నిర్మల్ జిల్లాలో గులాబీ శ్రేణుల రాస్తారోకో వల్ల రోడ్డుపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. నిజామాబాద్, బాల్కొండలలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా సంగారెడ్డి ఆర్డీవో కార్యాలయం ముందు బీఆర్ఎస్ శ్రేణులు ధర్నాకు దిగాయి. ఇప్పటికీ పూర్తిస్థాయిలో ధాన్యం కొనుగోళ్లు చేయడం లేదంటూ నర్సాపూర్‌లో ఎమ్మెల్యే సునీత రెడ్డి, గజ్వేల్‌లో వంటేరు ప్రతాప్ రెడ్డి ఆందోళన నిర్వహించారు. వరంగల్ జిల్లా ఖానాపూర్ మండలంలో ఐకేపీ కేంద్రం వద్ద మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి నిరసన తెలిపారు.
Former Minister Gangula Kamalakar Protest : అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని ఎలాంటి తరుగు లేకుండా కొనుగోలు చేయాలంటూ మంథని, మెట్‌పల్లిలో కార్యకర్తలు ధర్నా చేశారు. రైతులకిచ్చిన హామీలను కాంగ్రెస్ సర్కార్ తుంగలో తొక్కిందని హుస్నాబాద్‌లో వొడితెల సతీశ్ కుమార్, గోదావరిఖనిలో కోరుకంటి చందర్ ఆరోపించారు. పెద్దపల్లిలో మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో రైతు నిరసన దీక్ష చేపట్టారు. కరీంనగర్‌లో రైతులకు మద్దతుగా నిరసన చేపట్టిన మాజీ మంత్రి గంగుల కమలాకర్, ప్రభుత్వం మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు చేయడంతోపాటు అన్ని రకాల వడ్లకు బోనస్ చెల్లించాలని డిమాండ్ చేశారు.