BRS Leaders Complaint Against Danam Nagendar :బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ కండువా కప్పుకున్న ఖైరాతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై (Danam Nagendar Joins in Congress) వేటు వేయాలని గులాబీ పార్టీ నేతలు సభాపతిని కలిసి ఫిర్యాదు చేశారు. ఆయన అభ్యర్థిత్వాన్ని రద్దు చేయాలని కోరగా స్పీకర్ సానుకూలంగా స్పందించారని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఒక పార్టీలో గెలిచి మరో పార్టీలో చేరితే రాళ్లతో కొట్టాలన్నారని గుర్తు చేశారు.
"పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు నిర్ణయం మూడు నెలల్లో తీసుకోవాలని సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది. మూడు నెలల్లో దానం నాగేందర్‌పై అనర్హత వేటు పడుతుంది. రేవంత్ రెడ్డి మాపై దెబ్బ కొట్టారు. మేం తీసుకున్నాం. మేం కొట్టే దెబ్బ తీసుకోవడానికి రెడీగా ఉండండి. మా దెబ్బ పడ్డాక లేవడం మీ వల్ల కాదు. మేం గేట్లు తెరిస్తే మీరు భూస్థాపితం అవుతారు. జాగ్రత్త!! " - పాడి కౌశిక్ రెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే
BRS Leader Reaction on Danam Nagender Party Change :బీఆర్ఎస్కు చెందిన ఎమ్మెల్యే దానం నాగేందర్ ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ విషయంపై కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్ స్పందించారు. దానం హస్తం తీర్థం పుచ్చుకోవడం దురదృష్టకరమన్నారు. పార్టీ ఫిరాయింపునకు పాల్పడిన ఆయనపై అనర్హత వేటు వేయాలని శాసన సభాపతిని కోరామన్న ఆయన, సభాపతి ఈ అంశాన్ని పెండింగ్‌లో పెడుతున్నారన్నారు. తమ పిటిషన్‌పై త్వరగా తేల్చాలని ప్రసాద్ కుమార్‌ను కోరామని తెలిపారు. ఈ మేరకు తెలంగాణ భవన్లో ఆయన మాట్లాడారు.