KTR on Hyderabad it Lands :హైదరాబాద్‌లో ఐటీ, అనుబంధ పరిశ్రమలకు కేటాయించడానికి ఉద్దేశించిన భూమిని రేవంత్ సర్కార్ ప్రైవేటు ఫైనాన్స్ కంపెనీలకు తాకట్టు పెట్టాలని చూస్తోందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. సుమారు 400 ఎకరాల భూమిని తాకట్టు పెట్టి రూ.10 వేల కోట్ల రుణాన్ని తీసుకోవడానికి ప్రభుత్వం యత్నిస్తోందని ట్విట్టర్ వేదికగా తెలిపారు. నగరం చుట్టుపక్కల ఐటీ, అనుబంధ రంగాల పరిశ్రమలు వచ్చి, తెలంగాణ యువతకు ఉద్యోగాల కల్పన జరగాలి కానీ, ఈ భూములు తాకట్టు పెడితే కొత్త పరిశ్రమలు ఎలా వస్తాయని ప్రశ్నించారు. ఈ ప్రతిపాదన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం విరమించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యేల చుట్టూ తిరిగి ఇప్పుడు ఇలా : మరోవైపు ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టి పార్టీలో చేర్చుకుని, ఇప్పుడు తమవారని చెప్పుకోలేని కాంగ్రెస్ పరిస్థితిని చూస్తే జాలేస్తోందని కేటీఆర్ అన్నారు. ఎమ్మెల్యేల వివాదంపై మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు చేసిన కామెంట్స్‌పై ఆయన మండిపడ్డారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఇళ్ల చుట్టూ తిరిగి వారికి కాంగ్రెస్ కండువాలు కప్పి, ఇప్పుడు వారు వారు వివాదం పెట్టుకుంటే మాకేంటి సంబంధం అనటం సరికాదన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఇళ్ల చుట్టు తిరిగి వారికి కాంగ్రెస్ కండువాలు కప్పిన వారు ఎవరని, ఇంత నీతిమాలిన రాజకీయం ఎందుకని ప్రశ్నించారు. మీరు మీ అతి తెలివితో హైకోర్టును మోసం చేద్దాం అనుకుంటున్నారు కానీ, ప్రజలు అన్నీ గమనిస్తున్నారని ట్విట్టర్లో పోస్ట్ చేశారు.
బ్లాక్ లిస్టులో పెట్టాల్సిన మేఘా సంస్థకు పనులు ఎలా ఇస్తారు - కేటీఆర్ - KTR SLAMS CM REVANTH
గురుకులాలను పూర్తిగా మరిచింది :కాంగ్రెస్ ప్రభుత్వం గురుకులాలపై చిన్నచూపు చూస్తోందని మాజీ మంత్రి కేటీఆర్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ఒకటో తేదీన జీతాలు అని ఇవ్వటం లేదని, సమయానికి ఇవ్వకపోతే వాళ్ల కుటుంబాలు గడిచేదేలా అని ప్రశ్నించారు. గురుకులాల్లో విద్యార్థుల ఆరోగ్యానికి రక్షణ లేదు, వారి ప్రాణాలకు భరోసా లేదని, ఇప్పుడు జీతాలు సమయానికి ఇవ్వకుండా గురుకుల ఉద్యోగుల కుటుంబాలు రోడ్డున పడేస్తారా అంటూ మండిపడ్డారు. విద్యా సంవత్సరం ప్రారంభమై మూడు నెలలు గడిచినా ఏనాడైనా విద్యా శాఖ మీద రివ్యూ చేశారా? అని ప్రశ్నించారు. సకాలంలో వేతనాలు రాకపోతే గురుకుల ఉద్యోగులకు నెల గడిచేది ఎలా అంటూ అడిగారు.