BRS Leader Kavitha ED Custody Extended :దిల్లీ మద్యం కేసులో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ అరెస్టైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఈడీ కస్టడీ ఇవాళ్టితో ముగిసింది. విచారణ నిమిత్తం గతంలో వారం రోజుల పాటు కోర్టు ఇచ్చిన కస్టడీ నేటితో ముగియడంతో ఇవాళ మరోమారు సీబీఐ ప్రత్యేక న్యాయస్థానంలో ఆమెను అధికారులు హాజరుపరిచారు. కవితను మరో 5 రోజుల కస్టడీకి ఇవ్వాలని కోరారు. కేసు దర్యాప్తు పురోగతిని కోర్టుకు వివరించిన ఈడీ న్యాయవాది, కస్టడీ పొడిగిస్తే దిల్లీ సీఎం కేజ్రీవాల్‌తో పాటు మరికొందరిని కవితతో కలిసి విచారించనున్నట్లు చెప్పారు.
Kavitha ED Custody Ended :కేసు దర్యాప్తు పురోగతిని కోర్టుకు వివరించిన ఈడీ న్యాయవాది, కవిత కుటుంబ సభ్యులకు సంబంధించి వివరాలు వెల్లడించ లేదని చెప్పారు. కుటుంబ సభ్యుల వ్యాపార లావాదేవీలపై విచారణ జరుపుతున్నామని తెలిపారు. మద్యం కేసులో సమీర్ మహేంద్రును విచారించాల్సి ఉందని, మేకా శరణ్ నివాసంలో సోదాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఆయన దర్యాప్తునకు సహకరించడం లేదని వెల్లడించారు.
కవితకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు కోర్టుకు తెలిపిన ఈడీ అధికారులు (ED On Kavitha Custody), వైద్యులు సూచించిన ఆహారాన్నే ఇస్తున్నామని వివరించారు. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు కవిత కస్టడీని మరో మూడు రోజులు పొడిగిస్తూ తీర్పు వెలువరించింది. ఈ నెల 26వ తేదీ వరకు ఆమె ఈడీ కస్టడీలో ఉండనున్నారు. ఈడీ అధికారులు ఐదు రోజుల కస్టడీని కోరగా రౌస్ అవెన్యూ కోర్టు మూడ్రోజుల కస్టడీకి మాత్రమే అనుమతించింది.