BRS Leader Harish Rao on Peddavagu Issue : పెద్దవాగుకు గండికి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్ రావు ఆరోపించారు. సకాలంలో ప్రాజెక్టు గేట్లు తెరిచి ఉంటే ప్రమాదం తప్పేదని ధ్వజమెత్తారు. ఏపీ నుంచి హెలికాప్టర్లు రాకుంటే పరిస్థితి మరోలా ఉండేదని ఆందోళన చెందారు. ప్రాజెక్టు కొట్టుకుపోయి రెండు రోజులైనా మంత్రులకు తీరిక దొరకలేదా అంటూ ప్రశ్నించారు. ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉండి కూడా ఒరగబెట్టింది ఏమిటని అన్నారు. నష్టపోయిన ప్రతి రైతుక ఎకరాకు రూ.25 వేలు చొప్పున చెల్లించాలని హరీశ్‌రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ప్రభుత్వ నిర్లక్ష్యం, అధికారుల అలసత్వం వల్లే పెద్దవాగు ప్రాజెక్టుకు గండి పడిందని బీఆర్ఎస్ నేత హరీశ్‌రావు మండిపడ్డారు. రైతులు హెచ్చరించినప్పుడే జిల్లా కలెక్టర్, ఇరిగేషన్ అధికారులు అప్రమత్తమై గేట్లు తెరిచి ఉంటే రూ.100 కోట్ల నష్టం జరిగేది కాదన్నారు. కట్ట మీద నుంచి నాలుగైదు గంటల పాటు నీళ్లు పొంగిపొర్లుతుంటే గేట్లు ఎత్తకుండా అధికారులు ఎందుకు ఆలస్యం చేశారన్నారు. మూడు గేట్లుంటే రెండు గేట్లే ఎత్తడంలో అంతర్యం ఏంటని ప్రశ్నించారు. పెద్దవాగు ప్రాజెక్టు బద్దలై గుమ్మడివల్లి గ్రామాన్ని ముంచేసి ఉంటే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నల వర్షం కురిపించారు.
అధికారుల నిర్లక్ష్యం ప్రదర్శించి వందల మంది గిరిజల బిడ్డల ప్రాణాలు ఫణంగా పెట్టారని హరీశ్ రావు ఆగ్రహించారు. పెద్దవాగు ప్రాజెక్టు తెలంగాణ భూభాగంలోనే ఉందని పర్యవేక్షణ చేస్తున్నది భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన నీటిపారుదల శాఖ అధికారులేనని పేర్కొన్నారు. ప్రాజెక్టుకు గండి పడటం వల్ల గుమ్మడివల్లి, రంగాపురం, కోయరంగాపురం, బుచ్చువారిగూడెం, నారాయణపురం గ్రామాల్లో తీవ్రనష్టం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. పంటలతో పాటు పశుసంపదకు భారీ నష్టం వాటిల్లిందన్నారు.